Reading Time: < 1 minute

తిరుమలలో భక్తుల భద్రత కోసం AI టెక్నాలజీ… అలిపిరి నడక మార్గంలో గగనతల నిఘా…

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల భద్రత కోసం  కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. నడక మార్గంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత ప్రత్యేక చర్యలు చేపట్టింది టీటీడీ. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనల దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టీటీడీ. నడకదారిలో భక్తుల భద్రత అత్యంత కీలకమని… ముఖ్యంగా అటవీ ప్రాంతం గుండా వెళ్లే మార్గాల్లో వన్యప్రాణుల సంచారం ఉండటంతో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. 

భద్రతా చర్యలలో బాగంగా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని… భక్తులకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు AI ఆధారిత కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక పరికరాలను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇవి జంతువుల కదలికలను ముందుగానే గుర్తించి భక్తులకు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకునేలా సహాయపడుతాయని వెల్లడించింది.

అలిపిరి నుంచి తిరుమల వరకు ఉన్న కాలినడక దారిలో భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశామని… ఇవి సౌరశక్తితో పనిచేస్తూ 360 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల పరిస్థితులను గమనించగలుగుతాయని తెలిపారు అధికారులు. దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న కదలికలను కూడా స్పష్టంగా గుర్తించగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉందని… ముఖ్యంగా చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటిని గుర్తించి సమాచారం పంపే విధంగా రూపొందించినట్లు తెలిపారు. 

ఈ కెమెరాలు చెన్నైకి చెందిన ధీరా సంస్థ తయారు చేసిందని.. జంతువుల కదలికలతో పాటు మార్గంలో ఉన్న పరిస్థితులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఏఐ కెమెరాలు గుర్తించిన సమాచారం వెంటనే తిరుమలలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుందని… అదే సమయంలో సంబంధిత మొబైల్ యాప్‌కు కూడా అలర్ట్ వెళ్తుందని తెలిపారు. 

కెమెరా దగ్గర ఏర్పాటు చేసిన అలారం సైరన్ స్వయంగా మోగి జంతువులను భయపెడుతుందని… ఆ శబ్దంతో అవి అడవిలోకి వెళ్లిపోతాయని స్పష్టం చేశారు. ఈలోపు సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అవసరమైతే భక్తులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించే చర్యలు చేపడతారని తెలిపారు అధికారులు.

©️ VIL Media Pvt Ltd.