
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యాఖ్య
- తుమ్మలూరు గ్రామ సభకు చీఫ్ గెస్ట్‌గా అటెండ్
ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు స్పష్టం చేశారు. ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర గీతాలాపన అనంతరం సీఎం సందేశాన్ని చదివి వినిపించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. 2047 విజన్‌తో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాంలు కుట్టే పని, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు.హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.