Reading Time: 2 minutes
Csk Vs Pbks Ipl 2026 Dhoni Boost For Chennai Shreyas Iyer Doubt Playing Xi And H2h Stats

ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు తలపడనున్నాయి. పీబీకేఎస్‌పై విజయం సాధించి ఈ సీజన్‌లో బోణి కొట్టాలని సీఎస్‌కే చూస్తోంది. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సీఎస్‌కే ఆ ఓటమిని మరిచిపోయి.. తమ ప్రచారాన్ని సరికొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కేపై గెలిచి మరో విజయం ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది.

చెన్నైకి ధోనీ:
సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పిక్క గాయం నుంచి కోలుకుంటున్నందున గౌహతికి వెళ్లలేదు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు డగౌట్‌లో ఉండే అవకాశం ఉంది. ఇది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. ధోనీ రాకతో చెన్నై స్టేడియం మార్మోగనుంది. సీఎస్‌కే తరఫున తన మొదటి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని సంజు శాంసన్.. పీబీకేఎస్‌పై చెలరాలని చూస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు డెవాల్డ్ బ్రెవిస్ అందుబాటులో లేడు. అతను పక్కటెముకల గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో ఇంకా స్పష్టత లేదు. ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మలు చెలరేగాల్సిన అవసరం ఉంది. బౌలర్లు మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ గాడిన పడితే ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే పరిమితం చేయొచ్చు.

శ్రేయస్ డౌట్:
గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఆటగాడు కూపర్ కనోలి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్‌లో పేలవమైన ఆరంభం నుంచి జట్టును గట్టెక్కించిన కనోలి నుంచి మరో కీలక ఇన్నింగ్స్ ఆశిస్తోంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావడం పంజాబ్‌కు ఆందోళన కలిగిస్తోంది. శ్రేయస్‌కు ఎముక విరగలేదని, కానీ అతని చేయి వాచిందని జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ మ్యాచ్‌కు శ్రేయస్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య మంచి ఆరంభం ఇవ్వాల్సి ఉంది. నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ రాణించాల్సిన అవసరం ఉంది. పేసర్ విజయ్‌కుమార్ విశాక్ రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్ నిరాశపర్చాడు.

హెడ్ టు హెడ్:
ఐపీఎల్‌లో సీఎస్‌కే, పీబీకేఎస్ జట్లు 32 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఈ 32 మ్యాచ్‌లలో సీఎస్‌కే 16 సార్లు గెలుపొందగా.. పీబీకేఎస్ 16 సార్లు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఇటీవలి మ్యాచ్‌లలో పంజాబ్ ఆధిపత్యం చెలాయించింది. చెన్నైపై తమ చివరి ఏడు మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది. అయితే చేపాక్ చెన్నైకి కంచుకోటగా ఉండటంతో.. ఈ మ్యాచ్ పంజాబ్‌కు సవాల్ అనే చెప్పాలి.

తుది జట్లు (అంచనా):
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్‌టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్/ప్రశాంత్ వీర్.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ విశాక్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్/యశ్ ఠాకూర్.