Reading Time: < 1 minute
8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! ఏకంగా 34 శాతం జీతం పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాబోయే 8వ కేంద్ర వేతన సంఘంపై ఆశలు పెరుగుతున్నాయి. 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతాలు సుమారు 34 శాతం వరకు పెరగవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘాన్ని భారత ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. కమిషన్ వేతన నిర్మాణం, అలవెన్సులు, పెన్షన్ ప్రయోజనాలపై సమగ్ర సమీక్ష చేపడుతోంది. కమిషన్‌కు తన నివేదిక సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు. ఈ ప్రకారం 2027 మధ్య నాటికి సిఫార్సులు సిద్ధమయ్యే అవకాశం ఉంది.

అయితే సిఫార్సులు సమర్పించిన వెంటనే అమలు కాకపోవచ్చు. పరిపాలనా ప్రక్రియల కారణంగా కొంత ఆలస్యం జరిగే అవకాశముంది. అయినప్పటికీ గత వేతన సంఘాల మాదిరిగా, సవరించిన జీతాలను 2026 జనవరి 1 నుండి అమలులోకి తీసుకువచ్చి, మధ్యలో ఉన్న కాలానికి బకాయిలను చెల్లించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కమిషన్‌లో ముఖ్యంగా చర్చలో ఉన్న అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఇది ప్రాథమిక వేతనాన్ని పెంచే కీలక అంశం. గతంలో 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడంతో, కనీస వేతనం రూ.7,000 నుండి రూ.18,000కు పెరిగింది. అదే విధంగా గరిష్ట వేతనం నెలకు రూ.2.5 లక్షలకు చేరింది. ప్రస్తుతం 34 శాతం పెంపు అంచనా ఊహాజనితమైనదే అయినప్పటికీ, 8వ వేతన సంఘం అమలుతో ఉద్యోగుల టేక్-హోమ్ పే, పెన్షన్లు గణనీయంగా పెరగవచ్చనే ఆశలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కమిషన్ తుది నివేదికపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి