Reading Time: 2 minutes

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నా బ్రెయిన్ చైల్డ్ : సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.
  • ప్రభుత్వ విద్య బలోపేతమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్​ రెడ్డి 
  •     వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో నర్సరీ, ఎల్‌‌కేజీ, యూకేజీ

హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తన బ్రెయిన్ చైల్డ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. 

ప్రభుత్వ బడ్జెట్‌‌లో విద్యకు 8.3 శాతం కేటాయిస్తు న్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదని, ఈ పరిస్థి తి మారాలని టీచర్లకు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని ఏవీఎన్ లేక్‌‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్​ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆస్తి ఉన్నా చదువు లేకపోతే వెనుకబాటుతనం పోదు. చదువు ఉన్న కుటుంబం పేదరికంలో ఉన్నా గౌరవంగా బతుకుతోంది. 

అందుకే పేదరికానికి శాశ్వత పరిష్కారం చదువు మాత్రమే” అని సీఎం అన్నారు. ఆరుట్ల మోడల్ స్కూల్ తరహాలో అన్ని ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అత్యుత్తమ విద్యను ఒకే గొడుగు కిందకు తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో నర్సరీ, ఎల్‌‌కేజీ, యూకేజీ లేకపోవడంతో ప్రైవేటు వైపు వెళ్లడానికి ప్రధాన కారణమవుతోందని.. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ కిండర్ గార్టెన్ తరగతులను ప్రారంభిస్తున్నామ సీఎం  తెలిపారు. విద్యార్థుల కోసం నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్, పాలతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సర్టిఫికెట్ ఉంటే సరిపోదు.. స్కిల్స్ ఉండాలి

ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఉందని, దీనికి విరుగుడుగా టెక్నికల్ స్కిల్స్​ పెంచు కుని ‘బ్లూ కాలర్’ ఉద్యోగాల వైపు మళ్లాలని సీఎం సూచించారు. ఏటా 1.10 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నా, వారిలో నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగులుగా మారుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఆనంద్ మహీంద్రా చైర్మన్‌‌గా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. 

©️ VIL Media Pvt Ltd.