
భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు మార్కెట్లో యూజ్డ్ ఈవీ లేదా పాత ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు వస్తోంది కదా అని కక్కుర్తి పడితే.. ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాత ఈవీని కొనేముందు మీరు తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిన కీలక అంశాలు ఇవే..
బ్యాటరీ హెల్త్
ఎలక్ట్రిక్ కారుకు గుండెకాయ లాంటిది బ్యాటరీ. కారు పాతబడే కొద్దీ మొబైల్ ఫోన్ లాగే ఈవీ బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. బ్యాటరీ సెల్స్ బలహీనపడితే మైలేజీ పడిపోతుంది. బ్యాటరీ మార్చాల్సి వస్తే కారు కొన్న ధర కంటే ఎక్కువే ఖర్చు అవ్వచ్చు. అందుకే కొనేముందు బ్యాటరీ హెల్త్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి.
ఆన్‌బోర్డ్ ఛార్జర్
చాలా మంది ఈవీ యజమానులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. కారులోని ఆన్‌బోర్డ్ ఛార్జర్ సరిగ్గా పనిచేయకపోతే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. దీని రిపేర్ ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి, కారును టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టి, సాఫీగా ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేయడం మర్చిపోవద్దు.
ఎయిర్ హీట్ పంప్
చలికాలంలో కారు క్యాబిన్‌ను వేడిగా ఉంచడానికి, బ్యాటరీ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ హీట్ పంప్ ఉపయోగపడుతుంది. ఈవీలలో త్వరగా పాడయ్యే భాగాలలో ఇది ఒకటి. దీని రీపేర్ చేయడానికి వేల రూపాయలు ఖర్చవుతాయి. కాబట్టి ఏసీ, హీటింగ్ సిస్టమ్స్ పక్కాగా ఉన్నాయో లేదో చూడండి.
అండర్ బాడీ అండ్ కేసింగ్
ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్యాక్ సాధారణంగా కారు కింది భాగంలో ఉంటుంది. మన దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల లేదా రాళ్లు తగిలి బ్యాటరీ కేసింగ్‌కు గీతలు పడినా, నొక్కుకుపోయినా భవిష్యత్తులో బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే కారును పైకి లేపికింది భాగంలో ఎలాంటి డ్యామేజ్ లేదని నిర్ధారించుకోండి.
టైర్ల పరిస్థితి
సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల బరువు ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఈవీలు తక్షణ వేగాన్ని అందుకుంటాయి. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోతాయి. పాత ఈవీ కొనేటప్పుడు టైర్లు మార్చాల్సి వస్తే అది మీకు అదనపు భారం అవుతుంది.
తుప్పు పట్టిన భాగాలను చూడండి
ఆధునిక పెయింట్ టెక్నాలజీ వచ్చినా, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కార్లకు తుప్పు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కారులోని లోహ భాగాలు, బ్యాటరీ కనెక్షన్ల దగ్గర తుప్పు ఉంటే అది షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. కారు బాడీని, లోపలి భాగాలను నిశితంగా గమనించండి.