Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబానికి ఏటిఏంలాగా మారిందని కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ సొంత డబ్బుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా..? లేక ప్రజల సొమ్ముతో కట్టారా..? అని ప్రశ్నించారు. రాజ్యసభలో గురువారం నాడు అమరావతి బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర జలశక్తి మం త్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎంపి సురేష్‌రెడ్డి తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టుపై అనేక ఆరోపణలతో కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని నివేదికలు వచ్చాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగాయని ఆరోపించారు. కాళేశ్వరం వల్ల ఉగయోగం లేదని నివేదికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టు కట్టేందుకు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలంలో ఉన్న గ్రామాలు ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చినప్పుడు కెసిఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీ ఇంటికి వెళ్లలేదా, అప్పుడు గుర్తుకు రాలేదా ఏడు మండలాలు అంటూ ఎంపి సురేష్‌రెడ్డిపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి కెసిఆర్‌ను జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. దీంతో ఎంపి సురేష్‌రెడ్డికి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మధ్య తీవ్ర మధ్య వాగ్వాదం జరిగింది.

రెండు పిల్లర్లు కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు వృధానా..?: ఎంపి సురేష్‌రెడ్డి

కాళేశ్వరం ఒక డ్యాం మాత్రమేనని రెండు పిల్లర్లు కొట్టుకుపోతే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లు మాట్లాడడం సరికాదని రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే ప్రాజెక్టు పనికి రాదంటున్నారని సురేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, కిషన్‌రెడ్డిలతో జరిగిన వాగ్వాదంలో సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం గురించి కేంద్రమంత్రి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు నదిలో కొట్టుకుపోయాయని చేసిన ఆరోపణపై సురేష్‌రెడ్డి స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు వృథా అన్నట్లుగా మాట్లాడారని అన్నారు. తెలంగాణతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని సురేష్‌రెడ్డి తెలిపారు. విభజన తీరుపై బీజేపీ తరచుగా విమర్శలు చేస్తోందని సురేశ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

తల్లిని చంపి బిడ్డను తీశారంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రాష్ట్రాలు వేరైనప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉందామని కేసీఆర్ సైతం చెప్పారని సురేశ్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ఏపీ రాజధాని అమరావతికి కేసీఆర్ తన మద్దతు తెలిపారని చెప్పారు. దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలబెట్టారని అన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కనీసం చర్చ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించామని సురేశ్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రి పాటిల్ వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. రెండు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని సురేశ్ రెడ్డి సూచించారు.

కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాళేశ్వరం కట్టాము: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరమని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు రుణాలతో కాలేశ్వరం కట్టామని వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాలేశ్వరం నిర్మించామని చెప్పుకొచ్చారు. కాలేళ్వరంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని రవిచంద్ర విమర్శించారు.

వికసిత ఆంధ్రప్రదేశ్‌కి వికసిత రాజధాని అవసరం: ఎంపీ కె.లక్ష్మణ్

వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసిత రాజధాని అవసరమని బిజెపి రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభలో గురువారం అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రజలు రాజధాని సాకారం కోసం కలలు కన్నారని, ప్రధాని మోడీ సంకల్పంతో సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు రాజధాని కోసం సుధీర్ఘంగా పోరాడారని, ఆ పోరాటల ఫలితం నేడు ఆవిష్కృతమైందని అన్నారు. అమరావతి బిల్లు ఆమోదానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందన్న ఎంపి లక్ష్మణ్ దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబు కృషి చేశారని అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని, అయితే వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడి రైతులు, మహిళలను ఇబ్బందులకు గురి చేశారని లక్ష్మణ్ విమర్శించారు.