
అన్యాయమే అధికారమై రాజ్యమేలుతుంటే.. / అణగారిన వర్గాలపై అహంకారం విజృంభిస్తుంటే.. / వెట్టిచాకిరితో జీవితాలను బుగ్గిమయం చేస్తుంటే.. / ఆ నియంత పోకడలను ఎదురించిన యోధుడు దొడ్డి కొమురయ్య.’ నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న మిలిటరీ పాలనకు ఎదురొడ్డి 4000 మంది కార్యకర్తలు అమరులయ్యారు. ఆ కోవలో అమరుడై, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చిన యోధుడు ‘దొడ్డి కొమురయ్య’. భూసమస్యను దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా చేసింది తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది ‘బాంచెన్ దొరా నీ కాళ్లు మొక్కుతా’ అన్న బడుగు జీవులతో ఆయుధాలు పట్టించింది అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలోని విస్నూరు గ్రామంలో రాక్షతత్వానికి నిలువెత్తు నిదర్శనం అయినా విస్నూర్ దేశుముఖ్ రామచంద్రారెడ్డి, అతని కొడుకు బాబు దొర. వీరి ఆగడాలు అంతాఇంతా కాదు. 60 గ్రామాలకు అధిపతి ఈ నరరూప రాక్షసుడు నిజాంకు తొత్తులుగా ఉన్న దొరలు, పటేళ్లు, పట్వారీలు గ్రామాల్లో ప్రజలపై చేయని అఘాయిత్యం లేదు. విస్నూరు దగ్గరలో ఉన్న కడవెండి గ్రామాల రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ జాగీర్దార్ కడవెండి ఊరులో దొరసాని చేసిన ఆగడాలు తక్కువ ఏమీ కాదు. 20 ఎకరాలు కూడా లేని జానమ్మ దొరసాని అనతికాలంలో ఊరును అంత తన గుప్పిట్లో పెట్టుకుంది. జానమ్మ దొరసాని ప్రజలచేత దొర అని పిలిపించుకునేది.
ఈ అణచివేత నుండి 1944 ఆంధ్ర మహాసభ ఏర్పాటు తెలంగాణ ప్రాంతం అంతా ఆంధ్రమహాసభ నాయకత్వంలో గుండెలు మండి గ్రామాల్లో ప్రజలు ఒడిసెల, గుప్తలు, మహిళలు కారంపొడి సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. సంఘం అండతో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దుకోసం ఉద్యమ బాటపట్టారు. పన్నులు కట్టేది లేదని తిరుగుబాటు చేశారు. ఇది చూసిన దొరలు ఉద్యమాన్ని అణచడం కోసం అనేక ప్రయత్నాలు చేసేవారు. కడవెండి గ్రామస్థులు అయినా దొడ్డి కొమురయ్య, అన్నదొడ్డి మల్లయ్య గ్రామంలో గొల్ల, కురుమల నాయకుడు. దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వద్దని గొర్ల కాపర్లును చైతన్యపరిచాడు. దొడ్డి మల్లయ్యతోపాటు అదే గ్రామానికి చెందిన మంగలి కొండయ్య, నరసయ్య ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి, నల్లనరసింహులు అప్పుడున్న సంఘంలో చేరి గ్రామ నాయకులు అయ్యారు. ఇది మింగుడుపడని జానమ్మ దొరసాని వీళ్లను హతమార్చాలని పన్నాగం పన్నింది. ఈ కార్యక్రమంలో దొరసాని ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు అంతా నిరసన ప్రదర్శన చేయాలని సంఘం నిర్ణయించింది. 1946 జులై 4 సంఘం పిలుపు అందుకొని కడవెండి గ్రామంలో ప్రజలుఅంతా వీధుల గుండా ప్రదర్శన చేశారు. అప్పటికి దొరసానికి అండగా వచ్చిన విస్నూరు రామచంద్రారెడ్డి రౌడీలు కోడూరు దొర నరసింహారెడ్డి నాయకత్వం గడి నుండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు.
కడుపులోకి తూట దిగడంతో కొమురయ్య అక్కడికక్కడే నేలకొరిగాడు. కొమురయ్య అన్న మల్లయ్య కాలుకు తూట దూసుకుపోయింది. లక్ష్మీనరసయ్య కొండయ్యలకు గాయాలయ్యాయి. కొమురయ్య మరణం చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ సంఘం అండతో గ్రామాలలో దొర గుండాలను తరిమికొట్టారు. కొమురయ్య బలిదానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడుపోసింది. సంఘం పిలుపుతో ప్రజలు సాయుధ మార్గం పట్టారు. కొన్ని ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లుగా ఉంటూ ప్రజలను రాచిరంపాన పెట్టిన నరరూప రాక్షసులైన దొరలను, వారి ఆధిపత్యాన్ని కూలదోశారు. మహోత్తర పోరాటంలో 4000 నుంచి5000 మంది అమరులయ్యారు. దొడ్డి కొమురయ్య త్యాగం కేవలం ఒక వ్యక్తి బలిదానం మాత్రమే కాదు. అది తెలంగాణ మట్టిలో న్యాయం కోసం పోరాడే ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన ప్రాణత్యాగం తరువాత గ్రామీణ ప్రాంతాల్లో అణచివేతకు గురైన కూలీలు, రైతులు, దళితులు, గిరిజనులు తమ హక్కులకోసం సంఘటితమై పోరాట పథంలో అడుగులు వేసారు.
ఈ పోరాటం ప్రజల్లో స్వాభిమానాన్ని రగిలించి, భూమి రైతుకే అనే నినాదాన్ని గ్రామాలనుంచి దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం ప్రాంతీయ ఉద్యమం మాత్రమే కాదు, సామాజిక న్యాయంకోసం జరిగిన గొప్ప ప్రజావిప్లవం.దీనిలో పాల్గొన్న వేలాదిమంది అమరుల కథలు పాఠ్యపుస్తకాలలో స్థానం పొందితేనే యువతలో చరిత్రపట్ల అవగాహన పెరుగుతుంది. ప్రజల హక్కులకోసం ప్రాణాలు అర్పించిన వీరుల స్ఫూర్తిని కొనసాగించడం అంటే వారి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, భూవివాదాలు, సామాజిక వివక్షలను నిర్మూలించేందుకు పాలకులు కట్టుబడి పనిచేయాలి. అదే నిజమైన నివాళి. అలాగే ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా సామాజిక సంస్థలు, మేధావులు, యువత ముందుకు రావాలి. వీరుల త్యాగాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా మేధావులు కవులు, కళాకారులు, సామాజిక శక్తులు, ప్రగతిశీల శక్తులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొడ్డి కొమురయ్యతోపాటు సాయుధ పోరాట అమరుల అందరికీ నిజమైన నివాళి.-
– దయ్యాల అశోక్
95508 89907
( నేడు దొడ్డి కొమురయ్య జయంతి)