
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు తమ కూంబింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కింద చేపట్టిన మిషన్ -2026 ముగిసినప్పటికీ భద్రతా బలగాలు అడవిలో ఉన్న మిగిలిన నక్సల్స్ కోసం వేటను ముమ్మరం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు నక్సల్స్ డంప్‌లను స్వాధీనం చేసుకునే పనుల్లో బలగాలు నిమగ్నమయ్యాయి. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద జోజెర్, లేండ్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్‌లను సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ బృందం స్వాధీనం చేసుకున్నది.
స్వాధీనం చేసుకున్న వాటిలో 303 రైఫిల్, స్టెన్‌గన్, బీజీఎల్ రౌండ్స్, డెటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, వైర్, మావోయిస్టు సామగ్రి తయారుచేయడానికి ఉపయోగించే వస్తువులున్నాయి. బస్తర్‌లో మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేసినట్టు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. ఆయుధాలు వీడి వస్తే మంచిదన్నారు.ఓ పక్క మిగిలిన మావోయిస్టులను వేటాడుతూనే, ఇంకో పక్క పోలీసులు నక్సల్స్ లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు.