Reading Time: < 1 minute

హేట్ స్పీచ్ బిల్లు రాజ్యాంగ విరుద్దం.. వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా హరిస్తుంది: మాజీ మంత్రి హరీశ్రావు

Caption of Image.
  • అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతున్న సర్కారు

ఉప్పల్​, వెలుగు:  తెలంగాణ అసెంబ్లీలో ‘హేట్ ​స్పీచ్’​ బిల్లు తీసుకువచ్చి భారత రాజ్యాంగం ద్వారా  బాబాసాహెబ్​అంబేడ్కర్​ అందించిన స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ స్టూడెంట్స్​ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘డుసిమస్ వి లీడ్’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

ఈ బిల్లు వల్ల వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా హరించబడుతుందన్నారు. ఏ మార్పు తీసుకురావాలన్నా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలని, వ్యక్తి స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని తెలంగాణ సర్కార్​అప్రజాస్వామిక పద్దతులకు యత్నించడం ఎంత మాత్రం సహించరానిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడ్డది న్యాయవాదులేనని కితాబునిచ్చారు. 

దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్​లో ఉన్నాయని, పేదలకు, గొంతులేని  వారికి గొంతుకగా, న్యాయం దక్కని వారికి న్యాయం దక్కేలా పోరాడాలని కోరారు. ఓయూకు వచ్చినప్పుడల్లా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన విద్యార్థులు గుర్తుకు వస్తారన్నారు. మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో యువతులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్​ఎస్​వీ స్టూడెంట్​ వింగ్​ నాయకులు, లా స్టూడెంట్స్​ పాల్గొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.