
హైదరాబాద్ లోని చెరువులకు పునర్వైభవం తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మాదాపూర్‌లోని తుమ్మిడి కుంట చెరువు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హైటెక్స్‌లో జరిగిన టెక్స్టైల్ సదస్సులో పాల్గొన్న అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో సీఎం అకస్మాత్తుగా తుమ్మిడి కుంట చెరువును సందర్శించారు. చెరువు చుట్టూ కలియతిరిగిన ఆయన అక్కడ జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు కీలక వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఒకప్పుడు ఆక్రమణల కారణంగా కేవలం 14 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఆక్రమణల నుండి విముక్తి చేసింది. ఇప్పుడు ఈ చెరువు విస్తీర్ణాన్ని 28.05 ఎకరాలకు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం సుమారు 20 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కబ్జాలకు తావులేకుండా నీటి వనరులను కాపాడుతామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.