
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి. టీసీఎస్, పన్ను నిబంధనలు, పాన్ కార్డు నియమాలు వంటి వాటిల్లో అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ కొత్త చట్టం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జెన్ జెడ్, మిలినీయర్లు ఇల్లు కొనుగోలు చేసే శక్తిని ఇది పెంచుతుందని అంటున్నారు. భారత్‌లో ఇల్లు కొనడం అంటే అత్యంత ఖర్చులో కూడుకున్నది. ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలు, ఎన్నారై నిబంధనలు వంటి ప్రక్రియల వల్ల ఇల్లు కొనుగోలు అనేది భారంగా మారింది. కానీ కొత్త చట్టంతో కొన్ని మినహాయింపులు వచ్చినట్లయింది.
జెన్ జెడ్‌కు ప్రయోజనం
సొంతింటి కలను సాకారం చేసుకోవడం అనేది ప్రతీఒక్కరి కల. ఇందుకోసం బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు కూడా తీసుకుంటున్నారు. హోమ్ లోన్లపై పన్ను మినహాయింపులు ఉండటం వల్ల ఈఎంఐలు అనేవి తేలికగా అనిపించేవి. కానీ కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉండటం వల్ల పన్ను చెల్లింపుదారులు ప్రతీ నెలా తమ చేతికి ఎక్కువ డబ్బును పొందుతున్నారు. దీని వల్ల మినహాయింపులు తక్కువగా ఉన్నప్పటికీ.. దానికి బదులుగా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. టేక్ హోం శాలరీ పెరగడం, కొత్త పన్ను విధానం లాంటివి జెన్ జెడ్ కొత్త ఇంటిని కొనుగోలు చేయడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈఎంఐలు చెల్లించే సామర్థ్యం, డైన్ పేమెంట్లకు ప్లాన్ చేసుకునే అవకాశాన్ని మెరుగుపరుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇల్లు కొనుగోలు చేయడానికి నగదు లభ్యతను కొత్త నిబంధనలు అందిస్తున్నాయని చెబుతున్నారు.
ఎన్నారైలకు మరింత సులభతరం
కొత్త ఆదాయపు పన్ను చట్టం గృహ రంగ వ్యవస్థను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం, చేతికి వచ్చే ఆదాయం పెరగడం వల్ల లిక్విడిటీ, ఈఎంఐ చెల్లించే సామర్థ్యం పెరుగుతుంది. రణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఇది సహాయపడుతుంది. దీని వల్ల మెరుగైన సిబిల్ స్కోర్ ఉండటం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం పొందుతారు. ఇక టీసీఎస్ తగ్గింపు, పాన్ నిబంధనలు సులభతరం చేయడం ద్వారా ఎన్నారైలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీని వల్ల సరిహద్దులు దాటి చేసే పెట్టుబడులు సులభతరం అవుతాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు మరింత సమర్ధవంతగా జరుగుతాయి. జెన్ జెడ్‌తో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లో బలమైన వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కొత్త చట్టంతో ఉంటుందని నిపుణులు ఆశిస్తున్నారు.