
అమరావతి, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆరో తరగతితోపాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 1, 2026తో ముగిసింది. ఈ క్రమంలో కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. విద్యార్ధుల నుంచి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్న అధికారులు తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, పేద బాలికలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాలు, సందేహాల కోసం 79933 29115, 70750 39905 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఏప్రిల్ 17 వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని అన్నారు. ఎంపికైన వారికి ఉచిత విద్యా, భోజన, అవాస, నివాస సౌకర్యం కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.