Reading Time: 2 minutes

సర్కార్ దవా ఖానల్లో ఏఐ వైద్యం..ఏఐ టెక్నాలజీతో లంగ్ క్యాన్సర్, ఫ్యాటీ లివర్ నిర్ధారణ

Caption of Image.
  •     త్వరలో ఓ ప్రైవేట్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం  
  •     17 పారామీటర్ల ఆధారంగా పనిచేయనున్న ఏఐ 
  •     తొలుత మెడికల్ కాలేజీల్లో.. ఆపై రాష్ట్రమంతటా అమలుకు యోచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత ఆధునీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధుల గుర్తింపు కోసం ప్రత్యేక ఏఐ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

ఏఐతో లంగ్ క్యాన్సర్ గుర్తింపు

ప్రస్తుతం లంగ్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌ ను గుర్తించాలంటే సీటీ స్కాన్ వంటి ఖరీదైన టెస్టులు తప్పనిసరి. అయితే,  ఏఐ టెక్నాలజీతో కేవలం ఒక సాధారణ ఛాతీ ఎక్స్ -రే ద్వారానే క్యాన్సర్ ఆనవాళ్లను గుర్తించవచ్చు. పేషెంట్ ఎక్స్-రే రిపోర్టును ఏఐ సాఫ్ట్‌‌‌‌ వేర్ విశ్లేషించి.. అందులోని సుమారు 17 రకాల పారామీటర్లను పరిశీలిస్తుంది. ఊపిరితిత్తుల్లో గడ్డలు,  అసాధారణ మార్పులు ఉన్నట్లయితే టెక్నాలజీ వెంటనే గుర్తిస్తుంది. 

దీనివల్ల వ్యాధి ఫస్ట్ స్టేజ్ లోనే బయటపడి, చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుంది. అలాగే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించడానికి కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ ప్రక్రియపై కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది.

తొలుత కొన్ని మెడికల్ కాలేజీల్లో… 

ఈ  టెక్నాలజీని దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. తొలుత రాష్ట్రంలోని కొన్ని ప్రధాన మెడికల్ కాలేజీల్లో ఏఐ సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ను ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం అన్ని జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ కు సేవలను విస్తరిస్తారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత రోగులు కూడా ఖరీదైన స్కానింగ్‌‌‌‌ ల కోసం సిటీలకు రానవసరం లేకుండా… స్థానికంగానే నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలు పొందే అవకాశం ఉంటుంది.  కాగా, ఇప్పటికే కర్నాటక, తమిళనాడు, కేరళంలో ఈ ఏఐ ఆధారిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రొగ్రామ్ లు అమలవుతున్నాయి. అదే నమూనాలో మన రాష్ట్రంలోనూ వైద్య సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏఐతో వేగం,  కచ్చితత్వం…

వైద్య రంగంలో ఏఐ వాడకం వల్ల వ్యాధుల గుర్తింపులో వేగం పెరగడంతో పాటు కచ్చితత్తంతో కూడిన రిపోర్టు అందుతుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా అత్యంత సూక్ష్మమైన మార్పులను కూడా ఏఐ గుర్తిస్తుంది. సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. భారీ సంఖ్యలో వచ్చే రిపోర్టులను ఏఐ త్వరగా విశ్లేషించడం ద్వారా రేడియాలజిస్టుల పని సులభతరం అవుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రానున్న  సాంకేతిక మార్పులు ప్రభుత్వ వైద్య రంగంలో సరికొత్త అధ్యాయానికి దారితీస్తుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.