
మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం భారతీయ మద్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన అడ్డంకులు ఇప్పుడు నేరుగా మద్యం ధరల పెరుగుదలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ కొరత కారణంగా ప్యాకేజింగ్ ఖర్చులు భారంగా మారడం మద్యం కంపెనీలకు సవాలుగా మారింది.
మద్యం తయారీ కంటే, దానిని నిల్వ చేసే బాటిళ్ల ఉత్పత్తి ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీదైన వ్యవహారంగా మారింది. గాజు బాటిళ్ల తయారీకి వాడే ‘ఫర్నెస్’లను నిరంతరం మండించాల్సి ఉంటుంది.. దీనికి భారీగా ఇంధనం (గ్యాస్) అవసరం. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం ప్రధానంగా ఖతార్ వంటి దేశాలపై ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి, కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. దీనివల్ల బాటిళ్ల ఉత్పత్తి వ్యయం 15 నుంచి 20 శాతం పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read:Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్
బీరు తయారీలో ప్యాకేజింగ్ ఖర్చు 40 శాతం కాగా, విస్కీ వంటి స్పిరిట్స్ విభాగంలో ఇది 20 శాతంగా ఉంటుంది. షిప్పింగ్ ఖర్చులు కూడా పెరగడంతో, మద్యం బాటిళ్లపై మరో 10 నుంచి 15 శాతం ధర పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. అల్యూమినియం ధరలు సైతం 15 శాతం మేర పెరగడం వల్ల క్యాన్ల తయారీ కూడా భారమైంది.
వేసవి కాలంలో మద్యం.. ముఖ్యంగా బీర్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గ్యాస్ సరఫరా మెరుగుపడకపోతే, బాటిళ్ల కొరత ఏర్పడి మార్కెట్లో సరఫరా తగ్గవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఈ ఎండకాలంలో చల్లని పానీయాలతో సేదతీరాలనుకునే మందుబాబుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.