Reading Time: < 1 minute
ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి అమానుషం..!

సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన ఇది.. ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను అమానుషంగా గాయపరిచి పరారైయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్లలోని 13వ వార్డు రైల్వే స్టేషన్‌కి సమీపంలో జరిగిందీ ఘటన. బాధితురాలి ఫిర్యాడు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సత్తెనపల్లికి చెందిన మహిళ మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, తన అక్క కొడుకుని దత్తత తీసుకుని స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గుడ్‌ఫ్రైడే కావడంతో శుక్రవారం (మార్చి 03) రోజున సత్తెనపల్లికి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఇంతలో ఇంటి తలుపు తట్టిన అగంతకుడు, క్షణాల్లోనే లోపలికి వచ్చి ఆమెను కత్తితో బెదిరించాడు. ఆపై చున్నీతోనే కాళ్లు చేతులు కట్టివేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను అమానుషంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు.

కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన కొడుకు ఆమె పరిస్థితి చూసి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే స్థానికులు అమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డ దుండగుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై MLA జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్పందించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..