Reading Time: < 1 minute
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్‌! ఇక కేవలం 2 రోజుల్లోనే..

ఉద్యోగ మార్పు సమయంలో నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ (FnF) సెటిల్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సిన రోజులు ముగియనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోడ్‌ ఆన్‌ వేజెస్‌ 2019 కింద కొత్త నిబంధన ప్రకారం, ఉద్యోగి కంపెనీని విడిచిన రెండు పనిదినాల్లోపే పూర్తి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగులు తమ చివరి జీతం, బోనస్‌లు, ఇతర బకాయిల కోసం 40–45 రోజులు, కొన్నిసార్లు 90 రోజుల వరకు కూడా వేచి ఉండాల్సి వచ్చేది. ఈ ఆలస్యం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరుగుతుండేది. కొత్త నిబంధనతో ఈ సమస్యలకు ముగింపు పలికినట్లు అయింది.

ఈ నిబంధన అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, సంస్థ నుంచి తొలగించబడినా లేదా కంపెనీ మూసివేయబడినా ప్రతి సందర్భంలోనూ రెండు రోజుల్లోపే FnF చెల్లింపు తప్పనిసరి.

FnF సెటిల్‌మెంట్‌లో ఏం ఉంటాయి?

  • చివరి పనిదినం వరకు జీతం
  • వినియోగించని సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్
  • బోనస్‌లు, ప్రోత్సాహకాలు
  • ఆఫీసు ఖర్చుల రీయింబర్స్‌మెంట్
  • అవసరమైన తగ్గింపులు (పన్నులు, అడ్వాన్స్‌లు మొదలైనవి)

గ్రాట్యుటీపై కొత్త స్పష్టత

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒక సంవత్సరం సేవ తర్వాత కూడా గ్రాట్యుటీకి అర్హత లభించే అవకాశం ఉంది. ఈ మొత్తం 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది, ఇది ఉద్యోగులకు అదనపు భరోసా కలిగిస్తుంది. ఈ మార్పుతో ఉద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరే సమయంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా ముందుకు సాగగలుగుతారు. కంపెనీలపై ఆధారపడకుండా తమ సొంత డబ్బును వేగంగా పొందగలుగుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి