
- మార్కెట్లు పడిపోవడంతో తగ్గుతున్న డబ్బులు
- నిధి కరుగుతుండడంతో ఉద్యోగుల ఆందోళన
- ఓపీఎస్ అమలు చేయాలని ఎంప్లాయీస్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: యుద్ధం ఎక్కడో ఇరాన్-, ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతుంటే.. ఆ సెగ రాష్ట్రంలోని లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగులపై పడుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి, ఆ ప్రభావం ఉద్యోగుల రిటైర్మెంట్ నిధులపై పడుతున్నది. పదిహేను రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లోని నిధులు సుమారు రూ.1,300 కోట్లు కరిగినట్టు తెలుస్తున్నది.
ఇలా ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.2 లక్షల దాకా తగ్గడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి టీచర్లు, ఎంప్లాయీస్‌కు సీపీఎస్ విధానం అమలు చేస్తున్నారు. ఈ కేటగిరీ కింది ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది ఉండగా, వారిలో 80 వేల మంది టీచర్లున్నారు.
ప్రతినెలా వీరి ఖాతాల్లోంచి కట్ అయ్యేవీ, సర్కారు వాటా కలిపి సీపీఎస్ నిధులు ఎన్పీఎస్ ట్రస్ట్‌కు పోతాయి. అక్కడి నుంచి పీఎఫ్ఆర్డీఏ లిస్టు చేసిన ఫండ్ మేనేజర్‌కు చేరుతాయి. అక్కడి నుంచి ఆ నిధులను షేర్ మార్కెట్‌లో పెడతారు. అది మార్కెట్ హెచ్చ, తగ్గులు వీరికి వచ్చే డబ్బులపై ప్రభావం చూపుతాయి. మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతాయియి. అయితే ప్రస్తుతం ఇరాన్యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో నిధులు తగ్గుతున్నాయి.
మార్కెట్ ఒడిదుడుకుల వల్ల సొమ్ము తగ్గడంపై ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగులు కోరుతున్నారు. తెలంగాణలోనూ దీనిపై అనేక పోరాటాలు నిర్వహించారు. ఎక్కువ మంది సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పింఛన్ రూ.2 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే వస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేశారు. తెలంగాణలోనూ ఇచ్చిన హామీ ప్రకారం ఓపీఎస్ విధానం అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఓపీఎస్ పునరుద్ధరించాలి..
ఎక్కడో యుద్ధం జరుగుతున్న యుద్ధం ఉద్యోగి పెన్షన్ సొమ్మును తగ్గిస్తున్నది. రిటైర్మెంట్ తర్వాత లభించాల్సిన ఆర్థిక భద్రతను అంతర్జాతీయ మార్కెట్ చేతుల్లో పెట్టడం సరికాదు. సీపీఎస్‌లో ఉద్యోగి వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించేది కూడా ప్రజాధనమే. ఇంత భారీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల లాభనష్టాలకు తాకట్టు పెట్టడం ఉద్యోగులను వంచించడమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలి. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మాకు విముక్తి కల్పించి, పెన్షన్‌కు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే వరకు పోరాడుతాం.
– స్థితప్రజ్ఞ, సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లాంగ్వేజ్ పండిట్ అదె ధరం సింగ్ ప్రాన్(పీఆర్ఏఎన్) ఖాతాలో గతనెల మార్చి 14న రూ.18,88,500 ఉన్నాయి. కానీ, అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా మార్చి 31 నాటికి ఆ నిధి విలువ రూ. 18,17,933 కి పడిపోయింది. కేవలం 16 రోజుల్లో ఆయన రూ.70,567 నష్టపోయారు.
రోజుకు సగటున రూ.4,400 చొప్పున ఆయన కోల్పోయారు.నారాయణపేటలో ఎస్జీటీగా పనిచేస్తున్న కల్వల్ శ్రీకాంత్ ఖాతాలో మార్చి 18న రూ.20,93,640 ఉండగా, మార్చి 31 నాటికి ఆ మొత్తం రూ.20,51,936 కి పడిపోయింది. అంటే 13 రోజుల్లో ఆయన రూ.41,704 కోల్పోయారు.