Reading Time: 2 minutes

వాళ్లు మమ్మల్ని టార్గెట్ చేస్తే.. మరో ఉద్యమం చేయాల్సి వస్తది : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Caption of Image.

మహబూబ్ నగర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఉంటూ ఇక్కడే ఆస్తులు సంపాదించుకుని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ ఆంధ్రా ధనవంతులను హెచ్చరించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడితే ఆంధ్రకు చెందిన ధనవంతులు ఎందుకు స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఆంధ్ర ధనవంతులు మమ్మల్ని టార్గెట్ చేయడం మంచిది కాదు.. మీరు హద్దులు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్‌లో ఇళ్లు, స్కూళ్లు ఉంచుకుని ఇక్కడే నివాసం ఉంటున్న ఒక ఎంపీ.. తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే’ అని పిలవడంపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజును బ్లాక్ డే అనడం సమంజసమేనా? అంటూ నిలదీశారు. లైవ్ డిటెక్ట్ టెస్టులు చేసుకోవాలని సలహాలు ఇచ్చే ముందు మీ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఇదే ధోరణి కొనసాగితే ఆంధ్రా ధనవంతులపై మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. 

ALSO READ : సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి

అనిరుధ్ రెడ్డికి మంచు విష్ణు కౌంటర్

ఇటీవల మీడియాతో  మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ హీరోలకు డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర నటులు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, వారి సినిమా విడుదలకు ముందు ఈ రిపోర్టులు బయట పెట్టాలని సూచించారు.  తెలంగాణలో మారకద్రవ్యాల వాడకాన్ని అరికట్టడానికి ఇలాంటి చర్యలు సహాయయపడతాయన్నారు..  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘాటుగా స్పందించారు.  కేవలం నటులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.  మీది ‘మంచి సూచన’! అయితే, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి టెస్టులు చేయించుకోవాలనే నిబంధన ఉంటే ఎలా ఉంటుంది? అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు విష్ణు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి స్పందించారు.
 

©️ VIL Media Pvt Ltd.