Reading Time: 2 minutes

AIకి ఆత్మ లేదు.. AIని బలిపశువు చేయొద్దు.. ఈ కారణాలతోనే ఉద్యోగాలు తీసేస్తున్నారు..!

Caption of Image.

AI.. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. దీని వల్లే ఉద్యోగాలు పోతున్నాయని.. ఏఐ వల్లే ఐటీ రంగం సంక్షోభంలోకి వెళుతుంది అంటూ కొందరు సీఈఓలు మాట్లాడటం బాధగా ఉంది. AIని బలిపశువు చేద్దామని అనుకుంటున్నారా.. అది సాధ్యం కాదు.  ఈ మాటలు అన్నది సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్.

AIకి ఆత్మ లేదు. అది మనుషుల మధ్య అనుసంధాన్ని సృష్టిస్తుంది. ఏఐ సమన్వయం మాత్రమే చేస్తుంది.. అంతిమంగా డీల్స్ మనుషులే ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఈ మాటలు అన్నది కూడా సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్. అసలు ఈ మాటల వెనుక అర్థం ఏంటి.. టెక్ కంపెనీలు చేస్తున్న తప్పులకు ఏఐ ఎలా బలైపోతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ ఒక్క ఐటీ ఉద్యోగి ఉద్యోగం ఊడినా దానికి కారణం ఏఐ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవంగా మూడు కారణాల వల్లే ఉద్యోగులను కంపెనీలు తొలగించాల్సి వస్తోందని బెనియోఫ్ చెబుతున్నారు. కంపెనీపై ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవటానికి ఒక కారణం అయితే.. డేటా సెంటర్ల నిర్వహణ, నిర్మాణం మరొక కారణంగా చెప్పారు. ఆ తర్వాతనే AI కోసం ఉద్యోగుల తొలగింపులు వస్తున్నాయని.. అది కూడా రీబ్యాలెన్సింగ్ చేస్తున్నాం అన్నారు సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్.

టెక్ ప్రపంచంలో ప్రస్తుతం వినిపిస్తున్న ఏకైక మాట AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న వరుస లేఆఫ్స్‌కు కృత్రిమ మేధనే ప్రధాన కారణమని అందరూ నమ్ముతున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం ‘సేల్స్‌ఫోర్స్’ సీఈఓ మార్క్ బెనియోఫ్ మాత్రం ఈ వాదనను ఖచ్చితంగా తప్పని చెబుతున్నారు. అసలు విషయం అర్థం చేసుకోకుండా చాలా మంది ఏఐని ఒక బలిపశువుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏఐ పేరును వాడుకుంటున్నారన్నారు. ఇది కూడా ఒకరకమైన సోమరితనమే అంటూ కుండబద్దలు కొచ్చి లేఆఫ్స్ వెనుక వాస్తవాలను బయటపెట్టారు.

►ALSO READ | ఇండియాకు వస్తున్న ఆయిల్ నౌక.. యూటర్న్ తీసుకుని చైనాకు : మధ్యలో ఏం జరిగింది.. ఎందుకిలా..?

ప్రస్తుతం టెక్ రంగంలో జరుగుతున్న ఉద్యోగాల కోతకు ఏఐ ఒక్కటే కారణం కాదని బెనియోఫ్ చెబుతున్నారు. కంపెనీలు తమ ఖర్చులపై నియంత్రణను కోల్పోవటం మెుదటి కారణంగా చెప్పారు. కొవిడ్ సమయంలో అవసరానికి మించి విపరీతంగా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు.. ఇప్పుడు ఆ భారాన్ని మోయలేక లేఆఫ్స్ చేస్తున్నాయని వివరించారు. ఇక రెండవది.. డేటా సెంటర్ల ఆర్థిక అవసరాలు. ఏఐ మౌలిక సదుపాయాల కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఆ ఖర్చులను సర్దుబాటు చేసే క్రమంలో చేసేది లేక ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చివరిగా మూడో కారణం మాత్రమే నిజంగా ఏఐ వల్ల జరుగుతున్న రీబ్యాలెన్సింగ్ అని చెప్పారు. అంటే ఏఐ వల్ల పని సులభతరం కావడంతో కొన్ని విభాగాల్లో మార్పులు జరుగుతున్నాయి తప్ప అందరినీ తీసేయడం లేదు.

ఇంజనీర్ల రిక్రూట్మెంట్ తగ్గించినప్పటికీ సేల్స్ విభాగంలో నియామకాలు 20 శాతం పెంచారు సేల్స్‌ఫోర్స్‌ సీఈవో బెనియోఫ్. ఏఐకి ఆత్మ ఉండదని.. బిజినెస్ డీల్స్ చేయాలంటే ఖచ్చితంగా మనుషులు కావాల్సిందే అని స్పష్టం చేశారు. అందుకే ఈ ఏడాది తన కంపెనీలో దాదాపు 20వేల మంది కొత్త అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బెనియోఫ్. ఈ క్రమంలోనే జాక్ డోర్సీ వంటి ప్రముఖులు తమ కంపెనీల్లో భారీగా ఉద్యోగులను తొలగిస్తూ, దానికి ఏఐ రీస్ట్రక్చరింగ్ అని పేరు పెట్టడాన్ని బెనియోఫ్ తప్పుబట్టారు. గతంలో పరిమితికి మించి పెరిగిన కంపెనీలే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయని, దానికి ఏఐకి సంబంధం లేదని, సీఈఓలు ధైర్యంగా నిలబడి, అసలు కారణాలను ప్రజలకు వివరించాలని, ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మెుత్తానికి కంపెనీల తప్పుడు నిర్ణయాల కారణంగానే ఎక్కువగా ఉద్యోగాలు పోతున్నాయని దానిని ఏఐపై రుద్దడం సరైనది కాదంటున్నారు బెనియోఫ్.
 

©️ VIL Media Pvt Ltd.