Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గ పడుతున్న వేళ ‘సర్’ విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులను నిర్భందించడం తీవ్ర వివాదస్పదమైంది. పశ్చిమ బెంగాల్‌ను ‘దేశంలో అత్యంత ధ్రువీకృత రాష్ట్రం’గా పేర్కొంటూ, మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) సమయంలో ఏడుగురు న్యాయాధికారులపై జరిగిన ఘెరావ్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర పరిపాలన ‘పూర్తిగా విఫలమైందని’ విమర్శిస్తూ, ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో స్వతంత్ర దర్యాప్తు జరపాలని, ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సర్వే పేరుతో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాల్దా జిల్లాలో బుధవారం ఆందోళనలు జరిగాయి. ఇక్కడ సర్ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆందోళనకారులు నిర్బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత అక్కడికి చేరుకుని జ్యుడీషియల్ అధికారులను రక్షించారు. అడ్డుకున్న ఆందోళనకారులపై పోలీసులు

లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిర్బంధానికి గురైన వారిలో ముగ్గురు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఈ పరిణామాలపై సుప్రీంకోర్టు గురువారం స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను అడ్డుకునేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యేనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. “ఇది సాధారణ ఘటన కాదని, ప్రణాళికతోనే జ్యుడీషియల్ అధికారులను మానసికంగా దెబ్బతీయడానికి, సర్ ప్రక్రియను ఆపేందుకు కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆందోళనకారుల ఘెరావ్ గురించి మధ్యాహ్నమే సమాచారం అందినా.. రాష్ట్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాయం కోసం స్వయంగా కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్, హోం సెక్రటరీ, డీజీపీకి ఫోన్ చేయాల్సి వచ్చింది. వారి ఆదేశాలు అందినా జిల్లా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి రాలేదు. రాత్రి 11 గంటల వరకూ వారికి ఎలాంటి సహాయం అందలేదు. ఈ ఘటనలో రాష్ట్ర అధికారుల ప్రవర్తన అత్యంత విచారకరం. ఇది కోర్టు అధికారాన్ని సవాల్ చేసినట్లే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మేం ఎన్నటికీ అనుమతించబోం అని సుప్రీంకోర్టు కోప్పడింది.

ఇది రాజకీయేతర నిరసన అయితే, రాజకీయ నాయకులు అక్కడ ఏమి చేస్తున్నారు? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంటే వారు జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత లేదేంటి? తప్పు ఎవరు చేస్తున్నారో మాకు తెలియదనుకుంటున్నారా? ఈ ఘటనను నేను తెల్లవారుజామున రెండు గంటల వరకు పర్యవేక్షిస్తూనే ఉన్నా.. ఇది చాలా దురదృష్టకరం అని సీజేఐ వ్యాఖ్యానించారు. సాయంత్రం 5 గంటలకు ఘేరావ్ మొదలై రాత్రి 11 గంటల వరకు జిల్లా కలెక్టర్ అక్కడికి రాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల కమిషన్‌కు, న్యాయాధికారులు అభ్యంతరాలపై విచారణ జరిపే అన్ని కేంద్రాల్లో తగిన కేంద్ర బలగాలను మోహరించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపి, ప్రాథమిక నివేదికను నేరుగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది న్యాయాధికారులు, ఓటరు జాబితాల నుంచి తొలగించబడిన వారి 60 లక్షలకుపైగా అభ్యంతరాలపై విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన లేఖను సుప్రీంకోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. అందులో ముగ్గురు మహిళా న్యాయాధికారులు, ఐదేళ్ల చిన్నారితో సహా పలువురు అధికారులు ఆహారం, నీరు లేకుండా తొమ్మిది గంటలకు పైగా గుంపుల చేతిలో బందీగా ఉండాల్సి వచ్చినట్లు వివరించారు. చివరకు అర్ధరాత్రి తరువాత న్యాయాధికారులను విడుదల చేసినప్పటికీ, వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు జరిగినట్లు సీజేఐ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు న్యాయాధికారులపై భయానక ప్రభావం చూపుతాయి అని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మాల్దా జిల్లా కలెక్టర్, ఎస్పీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోర్టు షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. వీరందరూ ఏప్రిల్ 6న జరిగే తదుపరి విచారణకు ఆన్‌లైన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఇకపై న్యాయాధికారుల విధుల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, వారి ప్రాణ, ఆస్తి, కుటుంబ భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. న్యాయాధికారులు పని చేసే ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.