Reading Time: < 1 minute
Ajinkya Rahane Hits Back At Critics Over Strike Rate After Kkr Loss In Ipl 2026

Ajinkya Rahane Hits Back at Critics Over Strike Rate: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మరో ఓటమి ఎదురైంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన కేకేఆర్.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చేతిలో ఓటమిని చవిచూసింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యంను ఛేదించే క్రమంలో కేకేఆర్ తడబడింది. నిర్ణీత ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయి వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో కేకేఆర్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ అజింక్య రహానే.. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కీలకమైన సమయంలో నెమ్మదిగా ఆడి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో.. రహానే స్ట్రైక్‌రేట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆధునిక టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లుగా రహానే ఆడలేకపోతున్నారనే వాదనలు వినిపించాయి. వాటిపై రహానే ఘాటుగా స్పందించాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. తాను క్రికెట్ ఆడటం కొందరికి నచ్చడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జింక్స్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘నా స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసేవారికి అసలు క్రికెట్ గురించి తెలుసో లేదో అర్థం కావడం లేదు. బహుశా వారు సరిగ్గా మ్యాచ్‌లు చూడటం లేదేమో. లేదా నాపై ఏదైనా ప్రత్యేక అజెండాతో ఉన్నారేమో అనిపిస్తోంది. నా సక్సెస్ చూసి కొందరు అసూయ పడుతున్నారు. అందుకే నా ఆటను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కేవలం ఒక్క ఇన్నింగ్స్ ఫెయిల్యూర్‌ను బట్టి నా ఉద్దేశాలను తప్పుబట్టడం సరికాదు. నేను క్రికెట్ ఆడటం, విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. బయట నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా సరే.. నాపై చర్చ జరుగుతున్నందుకు నేను సంతోషంగానే ఉన్నాను. వారిని ఏదైనా మాట్లాడుకోనివ్వండి’ అని రహానే ఆవేదన వ్యక్తం చేశాడు.