
రేవల్లి, వెలుగు : వనపర్తి జిల్లా రేవల్లి, ఏదుల మండల కేంద్రాల్లో రూ. 64 లక్షల కలెక్టర్ ప్రత్యేక నిధులతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏదులలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
జిల్లావ్యాప్తంగా ఒకే రోజు 268 పంచాయతీల్లో సభలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ఏదుల గ్రామంలో 303 మందికి రూ. 2.77 కోట్ల రుణమాఫీ జరిగిందని, రేవల్లి మండలాభివృద్ధికి రూ. 51 కోట్లు కేటాయించినట్లు వివరించారు. తహసీల్దార్ కార్యాలయాల కోసం భూములిచ్చిన దాతలను ఘనంగా సన్మానించారు. అనంతరం నాగపూర్ హైస్కూల్‌లో రూ. 13.50 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను కలెక్టర్ ప్రారంభించారు.