
- ఏప్రిల్‌లో రెండు లక్షల టన్నులు కేటాయింపులు
- సరఫరాపై కేంద్రానికి లెటర్ రాసిన రాష్ట్ర మంత్రి
- ఎల్‌ఎన్‌జీ కొరతతో ఉత్పత్తిపై ప్రభావం
హైదరాబాద్, వెలుగు :
వానాకాలం సాగు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా సరఫరాపై అనిశ్చితి నెలకొంది. సాగు విస్తీర్ణం పెరగడం, పంటల మార్పు, నిల్వలు తక్కువగా ఉండడంతో ఈ సారి 13 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం ఉంటుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. దీంతో వానాకాలం కేటాయింపులను 10 లక్షల టన్నుల నుంచి భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పత్తి తగ్గి మక్క సాగు పెరగడంతో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ముఖ్యంగా జూలై, ఆగస్ట్ నెలల్లో గరిష్ట డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే బఫర్ స్టాక్ ఏర్పాటు అవసరమని సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి కేంద్రం 2 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. ఇందులో దేశీయ ఉత్పత్తి ద్వారా 1.33 లక్షల టన్నులు, దిగుమతుల ద్వారా 66,700 టన్నులు రానున్నాయి. అయితే మార్చిలో కేటాయించిన 1.34 లక్షల టన్నుల్లో సగానికిపైగా సరఫరా లోటు ఏర్పడింది. ఇందుకు ఆర్‌సీఎఫ్ క్రిబ్‌కో, ఆర్‌ఎఫ్‌సీఎల్ వంటి దేశీయ సంస్థల నుంచి సరఫరా తగ్గడమే కారణమని పలువురు అంటున్నారు.
- ఎల్‌ఎన్‌జీ కొరతతో తీవ్ర ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఎల్‌ఎన్‌జీ (లిక్విడ్ నేచురల్ గ్యాస్) సరఫరా తగ్గిపోవడం యూరియా ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. నేచురల్ గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా యూరియా ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్నాయి. ఫలితంగా నెలకు 9 నుంచి 10 లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం జరుగుతున్నట్లు అంచనా. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా రోజుకు 3,850 టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం 3,300 టన్నులకే పరిమితమైంది. ఇక్కడ ఉత్పత్తి తగ్గితే రాష్ట్ర సరఫరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
- కేంద్రానికి లెటర్ రాసిన రాష్ట్ర మంత్రి
రాష్ట్రంలో యూరియా సరఫరా సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యూరియా బఫర్ స్టాక్ ఏర్పాటు, దిగుమతులు పెంపు, గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నెలకు 2 లక్షల టన్నులు, జూలై, ఆగస్టులో అదనంగా 3 లక్షల టన్నులు అవసరమని లెటర్‌లో పేర్కొన్నారు.
- ఇంపోర్ట్‌పై వీడని డైలమా
యారియా దిగుమతులపైనా అనిశ్చితి నెలకొంది. భారత్ తన యూరియా అవసరాల్లో 20 నుంచి 30 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల కారణంగా సప్లై చైన్ దెబ్బతినడంతో జూన్, జులై నాటికి ఎరువుల లభ్యతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే సీజన్‌కు దేశవ్యాప్తంగా 390 లక్షల టన్నుల అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 180 లక్షల టన్నుల నిల్వలే ఉన్నాయి. ఈ లోటు పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- దిగుబడులపై ప్రభావం
వరి, మక్క, పత్తి పంటలకు యూరియానే కీలకం కావడంతో సరఫరా లోటు ఏర్పడితే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరగడం వల్ల రైతులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు నెలకు 2 లక్షల టన్నులు, జూలై, ఆగస్టులో అదనంగా మరో 3 లక్షల టన్నులు అవసరం అవుతాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోతే గత వానాకాలంలో ఎదురైన పరిస్థితులు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
గతేడాది రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సమస్య ఎదురుకాగా.. వచ్చే సీజన్‌లో సేమ్ సీన్ రిపీట్ కాకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. దిగుమతులు పెంచడం, యూరియా ప్లాంట్లకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు చేపడితేనే రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా సాధ్యం అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.