Reading Time: < 1 minute

మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. బీఆర్ఎస్ నేత కార్తీక్రెడ్డి పిటిషన్ను కొట్టివేసిన ఎన్జీటీ

Caption of Image.
  • డీపీఆర్  సిద్ధమయ్యాక అన్ని పర్మిషన్లు తీసుకుంటామన్న ప్రభుత్వం
  • పర్యావరణ అనుమతులు లేకుండానే ముందుకెళ్తున్నారన్న పిటిషనర్
  • కాలుష్య కోరల్లో ఉన్న నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని  ఆదిలోనే అడ్డుకోవడం సరికాదన్న ధర్మాసనం

హైదరాబాద్, వెలుగు: 
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టివేసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు 
పీ కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌ను తొందరపాటు చర్యగా ఎన్జీటీ బెంచ్ (చెన్నై) అభిప్రాయపడింది.

ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ప్రస్తుతం కేవలం సర్వేలు, ఎఫ్టీఎల్ మార్కింగ్ మాత్రమే జరుగుతున్నాయని జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ఎక్స్‌‌పర్ట్​ సభ్యులు  సత్యగోపాల్‌‌తో కూడిన బెంచ్​స్పష్టం చేసింది. ఎలాంటి పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు లేవని, కేవలం ఊహల ఆధారంగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌లో ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది.

 పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, దీంతో నదీ వ్యవస్థ దెబ్బతినడంతోపాటు వేలాది మంది నిరాశ్రయులవుతారని పిటిషనర్ వాదించారు.  రాష్ట్ర ప్రభుత్వం తరఫున  అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌‌రెడ్డి  వాదనలు వినిపిస్తూ..  ప్రాజెక్ట్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, బఫర్ జోన్ల గుర్తింపు మినహా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని వివరించారు. డీపీఆర్  సిద్ధమయ్యాక చట్టప్రకారం అన్ని రకాల పర్యావరణ అనుమతులు పొందుతామని, రాజకీయ దురుద్దేశంతో కేసు వేశారని కోర్టుకు వెల్లడించారు. 

కాలుష్య కోరల్లో ఉన్న నదిని ప్రక్షాళన చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని అది ప్రారంభం కాకముందే అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఇండ్ల కూల్చివేతలు, బాధితుల పునరావాసంలాంటి అంశాలు తమ పరిధిలోకి రావని, ఆ సమస్యలపై బాధితులు హైకోర్టును లేదా సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఎన్జీటీ సూచించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-2006 ప్రకారం నిబంధనలు  కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే, భవిష్యత్తులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే మళ్లీ ట్రిబ్యునల్‌‌ను ఆశ్రయించే వెసులుబాటును పిటిషనర్‌‌కు కల్పించింది.

©️ VIL Media Pvt Ltd.