
వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గురువారం 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు గణపురం, రేగొండ మండలాల్లో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రభుత్వ పథకాల అమలుతీరుపై వివరించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ హాజరై కార్యక్రమ అమలుపై పలు సూచనలు చేశారు. ధర్మసాగర్ మండలం ముప్పారంలో మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుంటిపల్లి రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు జనం హాజరై పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అంతారంలో నిర్వహించిన గ్రామసభలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ పాల్గొని మాట్లాడారు. రెండు ఉమ్మడి జిల్లాల్లోని ఆయా మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించారు. జనగామ మున్సిపాలిటీలోని 25వ వార్డులో కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ కుమార్ పర్యవేక్షణలో వార్డు సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని సమస్యలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరిపెడ మున్సిపల్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హాజరై మాట్లాడారు. పాల్వంచలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాశాఖ ఆఫీసర్ డాక్టర్ తుకారాం రాథోడ్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న హాజరై ప్రభుత పథకాలపై వివరించారు.
ములుగు జిల్లా వ్యాప్తంగా 171 గ్రామపంచాయతీలతోపాటు ములుగు మున్సిపాలిటీలోని 20వార్డుల్లో గ్రామసభలు జరిగాయి. ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే 1391 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ రమేశ్వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని ఆయా జీపీల్లో నిర్వహించిన గ్రామసభల్లో సుమారు 5939 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 571 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, 177 మున్సిపల్ వార్డుల్లో వార్డు సభలు విజయవంతంగా నిర్వహించినట్లు అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు.