
సముద్ర వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా వాణిజ్య నౌకలను సమకూర్చుకోవడంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించారు. సంక్లిష్ట సమయాల్లో నేవీ ముందుంటుందని పేర్కొన్నారు. దేశ వాణిజ్యం లోని 95 శాతం రవాణా సముద్ర మార్గం నౌకల ద్వారా సాగుతోందన్నారు. ఆత్మనిర్భర్‌కు ప్రతీకగా స్వదేశీయంగా తయారైన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తారగిరిని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పర్షియా జలసంధి యైనా, లేదా మలక్కా జలసంధి అయినా హిందూ మహాసముద్రంలో భారత నేవీ నిరంతరం
నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్ తారగిరిని ప్రారంభించడం నేవీ శక్తిసామర్థాలను, విలువలు, అంకిత భావాన్ని మరింత పెంచుతాయన్నారు. ప్రాజెక్టు 17ఎ తరగతిలో నిర్మించిన నాలుగో స్టెల్త్ యుద్ధనౌక తారగిరి 6670 టన్నుల బరువుతో ఉంటుంది. ముంబైకు చెందిన మజగాన్ డాక్ షిప్‌యార్డ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో బ్రహ్మోస్ క్షిపణులు వంటివి అమర్చడమైంది. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేసే ఈ యుద్ధనౌక బహుళ రకాల సముద్ర కార్యకలాసాలను నిర్వహించగలదు. ఐఎన్‌ఎస్ తారగిరి చేరికతో హిందూ పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన నౌకాశక్తిగా భారత్ స్థానం మరింత పటిష్ఠం కానుంది.