Reading Time: 2 minutes
Un Eu Warn Of Rising Energy Gas And Food Prices Amid Ongoing War

UN warning: ఇరాన్‌-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రారంభమైన యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. అయితే, యుద్ధ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన, గ్యాస్ మరియు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ హెచ్చరికలు జారీ చేశాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంటాయని యూరోపియన్ యూనియన్ తెలిపింది. అంతేకాకుండా ఐరోపాలో ఇంధన రేషనింగ్ విధించే పరిస్థితి కూడా రావచ్చని అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలు ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి.

Read Also: Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!

యూరోపియన్ యూనియన్ ఇంధన కమిషనర్ డాన్ జోర్గెన్సన్ మాట్లాడుతూ, “ఇది దీర్ఘకాలిక సంక్షోభంగా మారే అవకాశం ఉంది. ఇంధన ధరలు చాలా కాలం పాటు అధికంగానే ఉంటాయి” అని హెచ్చరించారు. భవిష్యత్తులో జెట్ ఇంధనం, డీజిల్ వంటి కీలక ఉత్పత్తులపై రేషనింగ్ అవసరం రావచ్చని కూడా సూచించారు. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీనివల్ల చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. విమానయాన రంగం కూడా జెట్ ఇంధన కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

2026 ఫిబ్రవరి చివరి నుండి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు $70-73 స్థాయి నుండి $100-110 పైగా పెరిగింది. అలాగే గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా 70-75 శాతం వరకు పెరిగాయి. ఆసియాలో LNG ధరలు 140 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక, ఆహార ధరల విషయంలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆహార మరియు వ్యవసాయ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి నెలలో ప్రపంచ ఆహార ధరలు గత ఏడాది సెప్టెంబర్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

ఐక్యరాజ్యసమితి ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో మాట్లాడుతూ.. ఈ యుద్ధం 40 రోజులకుపైగా కొనసాగితే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. రైతులు అధిక ఖర్చుల కారణంగా విత్తనాలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉందని, దీని వల్ల భవిష్యత్ దిగుబడులు తగ్గి ఆహార ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం “సరఫరా భద్రతా సంక్షోభం”లో లేకపోయినా, పరిస్థితులు మరింత దిగజారే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని దేశాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద యుద్ధం కొనసాగుతున్నంతకాలం ఇంధన, గ్యాస్, ఆహార ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారే అవకాశముంది.