Reading Time: < 1 minute

ఖమ్మం జిల్లాలో రూ. 547 కోట్ల సైబర్‌‌ క్రైమ్‌‌.. ముగ్గురు బ్యాంక్‌‌ ఉద్యోగులు అరెస్ట్‌‌..

Caption of Image.
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా రూ. 547 కోట్ల సైబర్‌‌ క్రైమ్‌‌
  • అకౌంట్ల ఓపెనింగ్‌‌కు సహకరించిన బ్యాంక్‌‌ ఆఫీసర్లు

సత్తుపల్లి, వెలుగు : కోట్లాది రూపాయల సైబర్‌‌ క్రైమ్‌‌ కేసులో నిందితులకు సహకరించిన ముగ్గురు బ్యాంక్‌‌ సిబ్బందిని భద్రాద్రి జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్‌‌ గురువారం మీడియాకు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముష్టిబండ గ్రామానికి చెందిన ఉడతనేని వికాస్‌‌ చౌదర్‌‌ తన భార్య నాగప్రియతో కలిసి సైబర్‌‌ మోసాలకు పాల్పడ్డారు. 

వీరు తమ సన్నిహితులు, ఫ్రెండ్స్‌‌ ద్వారా ఇండియాతో  పాటు ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఉన్న వారి మొబైల్‌‌ నంబర్లు, అకౌంట్ల వివరాలు సేకరించారు. తర్వాత ఆన్‌‌లైన్‌‌ గేమింగ్‌‌, ట్రేడింగ్‌‌, బెట్టింగ్‌‌ పేరుతో నమ్మించి వారందరినీ టెలిగ్రామ్‌‌ గ్రూప్‌‌లో సభ్యులుగా చేర్చారు. తర్వాత వివిధ మార్గాల ద్వారా పలువురి అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇలా రెండు మూడేండ్ల వ్యవధిలోనే సుమారు రూ. 547 కోట్లకు పైగా కొట్టేసినట్లు తెలిసింది. 

ఈ డబ్బును హవాలా ద్వారా దారి మళ్లించారు. ఇందుకు కొందరు నిరుద్యోగులకు డబ్బుఆశ చూపించి వారి పేరుతో అకౌంట్లను ఓపెన్‌‌ చేయించి యూజర్‌‌ ఐడీ, పాస్‌‌వర్డ్‌‌లను తమ వద్దే పెట్టుకొని సైబర్‌‌ క్రైమ్‌‌కు వాడుకున్నారు. వీరికి అకౌంట్లు ఓపెన్‌‌ చేయించేందుకు చంద్రుగొండ మండల కేంద్రంలోని కాథలిక్‌‌ సిరియన్‌‌ బ్యాంక్ కస్టమర్‌‌ రిలేషన్‌‌ ఆఫీసర్‌‌, బెండాలపాడు గ్రామానికి చెందిన ఓర్సు కృప, పెనుబల్లి మండలం బవన్నపాలెం గ్రామానికి చెందిన మందా శ్రీహరిబాబుతో పాటు, మద్దుకూరు గ్రామానికి చెందిన బ్రాంచ్ ఆపరేషన్స్‌‌ మేనేజర్‌‌ జుంజునూరి రాధాకృష్ణ సహకరించారు. 

సైబర్‌‌ క్రైమ్‌‌పై సత్తుపల్లి పీఎస్‌‌లో కేసు నమోదు కాగా.. గతంలోనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ముగ్గురు బ్యాంక్‌‌ సిబ్బందిని అరెస్ట్‌‌ చేశారు. ఈ కేసులో ఇంకా 20 మందికిపైగా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ వసుంధరయాదవ్‌‌, సీఐ తుమ్మలపల్లి శ్రీహరి తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.