
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. కేవలం సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో.. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై బస్సులోకి వెళ్ళి మరీ అమానుషంగా దాడికి తెగబడ్డాడు.
వరంగల్ డిపోకు చెందిన బస్సు వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తోంది. జగిత్యాల కొత్త బస్టాండ్ వద్దకు రాగానే.. ఆటో డ్రైవర్ ప్రదీప్, బస్సు డ్రైవర్ మహమ్మద్ జలీల్‌తో ఘర్షణకు దిగాడు. తనకు సైడ్ ఇవ్వలేదంటూ బస్సు ఆగిన వెంటనే లోపలికి ప్రవేశించిన ప్రదీప్.. డ్రైవర్ జలీల్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు.డ్రైవర్‌పై దాడి జరుగుతుండటం గమనించిన తోటి ఆర్టీసీ డ్రైవర్లు , సిబ్బంది వెంటనే స్పందించారు. దాడికి తెగబడ్డ ఆటో డ్రైవర్ ప్రదీప్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ALSO READ : నిర్మల్ జిల్లాలో పురుగుల మందు తాగిన సర్పంచ్..
ఈ దాడిలో ఆర్టీసీ డ్రైవర్ మహమ్మద్ జలీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.బస్సులో ప్రయాణికులు ఉండగానే ఆటో డ్రైవర్ ఇలా తెగబడటంపై ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.