
- కేరళ ఎన్నికల ప్రచారంలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల
- మేనిఫెస్టోలో ఇందిర ఐదు గ్యారంటీలు
- తెలంగాణకు వస్తే గ్యారంటీల అమలును చూపిస్తామన్న రేవంత్
హైదరాబాద్, వెలుగు: కేరళలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్, తెలంగాణను పదేండ్ల పాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన విషయంలో వారిద్దరూ ఒక్కటేనని ఆయన విమర్శించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎర్నాకుళంలో యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం రేవంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మార్పే.. ఈసారి కేరళలో రాబోతున్నదని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ఈ ఎన్నికల్లో విజయన్ ను గద్దె దింపుతారనే ఆశాభావాన్ని సీఎం రేవంత్ వ్యక్తం చేశారు. విజయన్ తమ రాజకీయ ప్రత్యర్థి అయినందున విమర్శలు చేయడం తమ నైజం అని, మోదీలా మాత్రం తాను విమర్శలు చేయకుండా ఉండలేనని అన్నారు. కేరళను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని.. ప్రధానిని, సీఎం విజయన్ ను ఉద్దేశించి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం మాయం ఉదంతాన్ని రేవంత్ లేవనెత్తారు.
మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు
సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు ఉన్నాయి. అందులో ఒకటి.. కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రెండోది.. కాలేజీల్లో చదువుతున్న బాలికలకు నెలకు రూ. వెయ్యి ఆర్థిక సహాయం. మూడోది.. సంక్షేమ పెన్షన్ లు నెలకు రూ. 3 వేలు పెంపు. నాలుగోది.. మాజీ సీఎం ఊమెన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా. ఐదోది.. యువతకు స్వయం ఉపాధి కోసం రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు. ఈ ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి మరో ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి హామీలు యూడీఎఫ్ మేనిఫెస్టోలో ఉన్నాయి. అయితే ఈ ఐదు గ్యారంటీల అమలు సాధ్యమా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దీనికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనని రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలను ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కేరళంలో పినరయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలు కానుందన్నారు. సీఎం రేవంత్ బుధ, గురువారాల్లో కేరళలో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.