
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సూపర్‌స్టార్ కృష్ణ చేసిన సేవలు అపారమైనవి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సినీరంగానికి ఎనలేని మేలు చేశారు. పరిశ్రమ స్థాయిని పెంచిన నటులలో ఆయన ఒకరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సినిమాలు పరిశ్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ్డాయి. కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లి ఇన్నాళ్లు అవుతున్నా ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంలో, ఆయన వ్యక్తిగత మేకప్‌మెన్ మాధవరావు గారు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కృష్ణ గారి నిస్వార్థ గుణాన్ని వెల్లడించారు. తన దగ్గరకు వచ్చిన మంచి కథలను సైతం ఆయన ఇతర నటులకు ఎలా ఇచ్చేవారో వివరించారు. కృష్ణ గారు వదులుకున్న సినిమాలతో ఎంతో మంది హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారని తెలిపారు.
కృష్ణ గారు వదులుకున్న సినిమాలలో చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన ఖైదీ సినిమా ఒకటి. ఖైదీ కథ తొలుత సూపర్‌స్టార్ కృష్ణ దగ్గరకు వచ్చిందట. అయితే, కృష్ణ గారు ఆ కథను చిరంజీవికి ఇవ్వమని సూచించారట. చిరంజీవి నృత్యాలు బాగా చేస్తారు కాబట్టి ఈ సినిమాకు తనే సరైన ఎంపిక అని కృష్ణ గారు చెప్పినట్లు మాధవరావు వెల్లడించారు. కృష్ణ గారి సలహా మేరకే ఖైదీ సినిమా చిరంజీవితో తెరకెక్కింది. A. కొదండరామి రెడ్డి దర్శకత్వంలో K. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి, చిరంజీవికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మాధవి, సుమలత వంటి నటీమణులు కూడా కీలక పాత్రలు పోషించారు.
ఇదే విధంగా, రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య సినిమా కథ కూడా మొదట కృష్ణ గారి వద్దకు వచ్చింది. ఈ కథకు కృష్ణంరాజు గారు అయితే మరింత న్యాయం చేయగలరని భావించిన కృష్ణ గారు, ఆ కథను ఆయనకు ఇవ్వమని సూచించారట. అలా తన దగ్గరకు వచ్చిన కథ ఎంత బాగున్నా, తనకంటే వేరే నటులు ఆ పాత్రకు మరింత బాగా సరిపోతారని భావిస్తే, ఆ అవకాశాన్ని వారికి ఇవ్వమని సజెస్ట్ చేసేవారు కృష్ణ గారు. ఒక మంచి కథను వేరే హీరోకి ఇస్తే అది హిట్ అవుతుందని తెలిసినా, తన తోటి నటీనటులు కూడా మంచి విజయం సాధించాలని ఆశించే నిస్వార్థమైన మనసు సూపర్‌స్టార్ కృష్ణ గారిది. అందుకే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన హీరోగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాధవరావు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.