Reading Time: 4 minutes

పశ్చిమాసియాలో 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాక, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఏకధ్రువ ప్రపంచ క్రమం కుప్పకూలుతున్న ఒక చారిత్రక ఘట్టంగా పరిణమించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభంలో కొన్ని విజయాలను సాధించినప్పటికీ, ఇరాన్ పటిష్టమైన యుద్ధతంత్రం, అసిమెట్రిక్ యుద్ధ నైపుణ్యం ముందు ఆ అగ్రరాజ్యాల సాంకేతిక గర్వం నీరుగారిపోయింది. ముఖ్యంగా, అమెరికా గర్వపడే గగనతల నిఘా వ్యవస్థలకు వెన్నెముకవంటి అవాక్స్ విమానాన్ని ఇరాన్ కూల్చివేయడం,ఆ దేశపు రక్షణ వ్యవస్థలోని లొసుగులను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ యుద్ధం కేవలం సైనికపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా అమెరికాను దివాలా అంచుకు నెట్టివేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఒక పరాన్న దేశంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతగా అమెరికాపై ఆధారపడి ఉందో స్పష్టమైంది. రష్యా, చైనా, ఇండియా వంటి ఎదుగుతున్న శక్తులు ఇప్పుడు ఏకమై ఒక చిన్న తోపు తోస్తే, పాత ప్రపంచ క్రమం అంతమై ఒక నూతన బహుధ్రువ ప్రపంచం ఆవిర్భవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మార్చి 2026 చివరి వారంలో జరిగిన ఒక కీలక పరిణామం యుద్ధగమనాన్ని పూర్తిగా మార్చివేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌మీద ఇరాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడిలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఇ-3 సెంట్రీ(అవాక్స్) విమానం ధ్వంసమైంది. ఈ విమానం కేవలం ఒక వాహనం కాదు. అది గగనతలంలో కదిలే ఒక కమాండ్ సెంటర్. ఇది సుమారు 250 మైళ్ల (375 కిలోమీటర్లు) పరిధిలోని ప్రతి చిన్న కదలికను -అవి డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, యుద్ధవిమానాలు కావచ్చు- అన్నింటినీ గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతోనే అమెరికా ప్రపంచ దేశాలపై ఇన్నాళ్లూ తన పెత్తనాన్ని చలాయించింది. అయితే ఇరాన్ తన పటిష్టమైన యుద్ధతంత్రంతో ఈ ‘కదిలే రాడార్’ను మట్టుబెట్టడం ద్వారా అమెరికా గగనతల ఆధిపత్యాన్ని సవాలు చేసింది.

అవాక్స్‌ను కోల్పోవడంవల్ల అమెరికా సైన్యానికి యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో తెలియని ‘అంధత్వం’ ఏర్పడింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న రాడార్లపై ఆధారపడాల్సి రావడం, అవి కూడా ఇరాన్ దాడులకు గురవుతుండడంతో అమెరికా రక్షణ వ్యవస్థలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడింది. నిఘా విమానమైన ఇ-3 సెంట్రీ (అవాక్స్) పూర్తిగా ధ్వంసం కావడంతో 270 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. కెసి-135 స్ట్రాటోట్యాంకర్ యుద్ధ విమానాల్లో ఒకటి కూలిపోగా, ఐదు ధ్వంసమయ్యాయి. ఇవి ఒక్కో విమానం 165 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఎఫ్-15 ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మూడు కూలిపోయాయి. ఇవి ఒక్కోటి 100 మిలియన్ డాలర్లు ఉంటుంది. అత్యాధునిక జెట్ అయిన ఎఫ్-35ఎ లైట్నింగ్ II అత్యవసర ల్యాండింగ్ అయి ధ్వంసమైంది. దీనికి 82.5 మిలియన్ డాలర్లు ఉంటుంది. దాదాపు పన్నెండుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూలిపోయాయి. వీటితో 30- 40 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. రక్షణ రాడార్ ఎఎన్/ టిపివై-2 (థాడ్) ధ్వంసం కావడంతో 500 మిలియన్ డాలర్ల నష్టం జరిగింది.

దీనిని విశ్లేషిస్తే, అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను ఇరాన్ వంటి దేశం ఎదురుదాడులనుంచి కాపాడుకోవడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎఫ్-15ఇ విమానాలు కువైట్ విమానాల ద్వారా పొరపాటున కూల్చివేయబడడం, అమెరికా నాయకత్వంలోని కూటమిలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. అమెరికా తన అత్యంత ఖరీదైన క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన థాడ్ (టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్), దాని రాడార్ ఎఎన్/టివివై-2పై అమితమైన విశ్వాసాన్ని ఉంచింది. ఈ వ్యవస్థ అంతరిక్షం నుంచి వచ్చే హైపర్సోనిక్ క్షిపణులను కూడా గుర్తించగలదు. కానీ ఇరాన్ యుద్ధం ఒక ‘సాంకేతిక వైరుధ్యాన్ని’ బయటపెట్టింది. కోట్లాది డాలర్ల విలువైన ఈ రాడార్ వ్యవస్థలు కేవలం 35,000 డాలర్ల విలువ చేసే చిన్న డ్రోన్ల దాడికి ఛిద్రమైపోయాయి. జోర్డాన్‌లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఎఎన్/టిపివై-2 రాడార్ ఇరాన్ దాడుల్లో ధ్వంసం కావడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఈ రాడార్‌లు ఒకచోట స్థిరంగా ఉండడంవల్ల శత్రువులకు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి.

అత్యాధునిక రాడార్ అరేలు ఎంత సున్నితంగా ఉంటాయంటే, ఒక చిన్న పేలుడు కూడా ఆ వ్యవస్థను పూర్తిగా పనికిరాకుండా చేయగలదు. ఈ వైఫల్యం వల్ల ఇరాన్‌నుంచి వచ్చే క్షిపణులను గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇది ఇజ్రాయెల్, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న అమెరికా, ఈ యుద్ధం కోసం అదనంగా 200 బిలియన్ డాలర్ల అత్యవసర నిధుల కోసం పెంటగాన్ ద్వారా వైట్ హౌస్‌ను కోరింది. యుద్ధం మొదలైన మొదటి మూడు వారాల్లోనే సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల మార్కెట్, సాధారణంగా యుద్ధ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించబడుతుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్టుబడిదారులు అమెరికా ప్రభుత్వం తన అప్పులను తీర్చగలదా అనే అనుమానంతో బాండ్లను విక్రయిస్తున్నారు.

దీనివల్ల గ్లోబల్ బాండ్ మార్కెట్ నుంచి మార్చి నెలలోనే 2.5 ట్రిలియన్ డాలర్ల విలువ ఆవిరైపోయింది. ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరగడం, పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు చేరువ కావడం అమెరికా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ గణాంకాలు అమెరికా ఆర్థికంగా ఎంత పటిష్టమైన దేశమో నిరూపిస్తున్నాయి. ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుండడం ఈ పతనానికి ప్రధాన సంకేతం. ఇజ్రాయెల్ తన సాంకేతిక నైపుణ్యంతో ఇరాన్‌పై దాడులు చేస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఆ దేశం అమెరికా ఇచ్చే ‘సైనిక ప్రాణవాయువు’ (స్ట్రాటజిక్ ఆక్సిజన్ పైపులైన్) మీద పూర్తిగా ఆధారపడి ఉందని అర్థమవుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో తాము స్వయం సమృద్ధి సాధిస్తామని ప్రగల్భాలు పలికినప్పటికీ, యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే ఆ దేశ మందుగుండు సామాగ్రి నిల్వలు నిండుకున్నాయి. అమెరికా సరఫరా చేసే మందుగుండు లేకపోతే ఇజ్రాయెల్ ఒక్క వారం కూడా యుద్ధం చేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ‘గా (వార్‌ఎకానమీ) మారిపోయింది. పౌర రంగాలు, పర్యాటకం, వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయాయి.

కేవలం సైనిక ఎగుమతులు మాత్రమే ఆ దేశాన్ని కాపాడుతున్నాయి. 2024లో 15బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులు చేసిన ఇజ్రాయెల్, ఇప్పుడు తన ఉనికి కోసం ప్రతి వనరును యుద్ధానికే మళ్లిస్తోంది. ఇది ఇజ్రాయెల్‌ను ఒక ‘సూపర్ స్పార్టా’ దేశంగా మార్చేసింది. అంటే నిరంతరం యుద్ధం మీదనే ఆధారపడే స్థితి. మార్చి 4, 2026న ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒక అణుబాంబు వంటి ప్రభావాన్ని చూపింది. ప్రపంచంలోని 20% చమురు సరఫరా, గణనీయమైన గ్యాస్ సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకొని, చమురు రవాణా చేసే నౌకల నుంచి సుంకాలను కేవలం చైనీస్ యువాన్‌లో మాత్రమే వసూలు చేస్తోంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి పడిన అతిపెద్ద దెబ్బ. చైనా క్రాస్-బోర్డర్ పేమెంట్ సిస్టమ్‌ద్వారా లావాదేవీలు జరగడం వల్ల అమెరికా ఆంక్షలు నిర్వీర్యమయ్యాయి. గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికా రక్షణ కవచం బలహీనపడడంతో తమ ఆర్థిక మార్గాలను చైనా వైపు మళ్లిస్తున్నాయి.

ప్రస్తుత యుద్ధం ఒక సరికొత్త భౌగోళిక రాజకీయ మార్పును తెచ్చినట్టు కనిపిస్తోంది. అమెరికా అస్థిరమైన నాయకత్వాన్ని చూసిన జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా ఇప్పుడు తమ భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. రష్యా బహిరంగంగా అమెరికా దాడులను ఖండిస్తూనే, తెరవెనుక ఇరాన్‌కు ఉపగ్రహ సమాచారాన్ని, డ్రోన్ యుద్ధతంత్రాలను అందిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్నప్పటికీ, ఇరాన్‌ను అమెరికా పతనానికి ఒక ఆయుధంగా రష్యా వాడుకుంటోంది. చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే ఆర్థికంగా అమెరికాను దెబ్బతీస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక అండగా నిలుస్తూ, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమి ద్వారా ప్రత్యామ్నాయ ప్రపంచ క్రమాన్ని నిర్మిస్తోంది. భారతదేశం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూనే, తన ఇంధన భద్రత కోసం రష్యా, ఇరాన్‌లతో సంబంధాలను కొనసాగిస్తోంది.

అమెరికా బలహీనపడడంవల్ల దానికి సాగిలపడకపోతే ఇండియా వంటి దేశాలకు ప్రపంచ స్థాయిలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం పెరుగుతుందనుకోవచ్చు. జపాన్, జర్మనీ దేశాలు ఇన్నేండ్లూ అమెరికా రక్షణ గొడుగు కింద ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా స్వయంగా యుద్ధంలో చిక్కుకోవడంతో, అవి తమ రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఇరాన్ యుద్ధం అమెరికా అజేయత అనే భ్రమను తొలగించింది. ప్రపంచ పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికా, ఇప్పుడు తన సొంత ఆర్థిక సమస్యలు, సైనిక వైఫల్యాలతో సతమతమవుతోంది. ఇజ్రాయెల్ తన మనుగడకోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడే బలహీన దేశంగా మిగిలిపోయింది. ఇరాన్ చూపిన పటిష్టమైన యుద్ధతంత్రం, ఆధునిక సాంకేతికత కంటే వ్యూహాత్మక ధైర్యం గొప్పదని నిరూపించింది. ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా వంటి శక్తులు ఏకమై ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని కొనసాగిస్తే, పాత సామ్రాజ్యాల పతనం పూర్తి కావడం ఖాయం. ప్రపంచం ఇప్పుడు ఏకధ్రువ ఆధిపత్యం నుంచి బహుళ ధ్రువ సహకారంవైపు అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక యుద్ధం ముగింపు కాదు. ఒక నూతన శకానికి ఆరంభం. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ గమనాన్ని శాసించలేదు.  

– మేకల ఎల్లయ్య

-99121 78129