
కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం అనేది రుచికరమైన వంటకాలకు తాజా ఆకులను అందించడమే కాకుండా.. తోటపని ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే, ఈ మొక్కను గుబురుగా, ఆరోగ్యంగా పెంచడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నర్సరీ నుంచి తెచ్చినప్పటి నుంచి మొక్కను ఎలా సంరక్షించుకోవాలి.. ఎలాంటి మట్టి మిశ్రమాన్ని ఉపయోగించాలి, ఎరువులు, తెగుళ్ల నియంత్రణ వంటి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. వాస్తవానికి కరివేపాకులో విటమిన్ A, B, C, E, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎన్నో ససమ్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. కూరలో కరివేపాకులు వేయడం వల్ల ఆహారం రుచి పెరగడంతోపాటు.. ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాంటి కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటే.. చాలా మంచిది..
కరివేపాకు మొక్కను ఎంచుకోవడం, నాటడం:
కరివేపాకు మొక్కను విత్తనాల ద్వారా లేదా కొమ్మల ద్వారా పెంచవచ్చు. నర్సరీ నుంచి మొక్కను తెచ్చినప్పుడు, దాన్ని వెంటనే పెద్ద కుండీలోకి మార్చకుండా 8 అంగుళాలు లేదా 10 అంగుళాల కుండీలో నాటడం మంచిది. కనీసం ఆరు నెలల వరకు అదే కుండీలో ఉంచాలి. తర్వాత 25 లీటర్ల బకెట్ లేదా వంద రూపాయల టబ్‌లోకి మార్చుకోవచ్చు. ఒకేసారి పెద్ద కుండీలో పెట్టడం వల్ల వేర్లు బాగా అభివృద్ధి చెంది మొక్క ఎదుగుదల తగ్గే అవకాశం ఉంది.
మట్టి మిశ్రమం:
మట్టి మిశ్రమం తయారీలో 40% సాధారణ మట్టి (ఎర్రమట్టి లేదా నల్లమట్టి), 40% వర్మికంపోస్ట్ లేదా పశువుల ఎరువు, మిగిలిన 20% ఇసుక, వేపపిండి, కోకోపీట్ కలిపి ఉపయోగించాలి. కుండీకి ఎక్కువ డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. ఇది అదనపు నీరు బయటకు పోవడానికి సహాయపడుతుంది.
సూర్యరశ్మి, స్థానం:
కరివేపాకు మొక్కకు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పూర్తి సూర్యరశ్మి అవసరం. ఇంట్లోని పెరట్లో సూర్యరశ్మి బాగా తగిలితేనే మొక్క ఆరోగ్యంగా, గుబురుగా పెరుగుతుంది. బాల్కనీలలో తక్కువ సూర్యరశ్మి లభించే ప్రదేశాలలో ఈ మొక్క పెరగడం కష్టం..
తెగుళ్ల నియంత్రణ:
వర్షాకాలం, చలికాలంలో కరివేపాకు మొక్క నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో ఆకులపై పేనుబంక, నల్లటి మచ్చలు, ఆకులు ముడుచుకుపోవడం వంటి తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. తెగుళ్లు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండిపోయిన, పండిపోయిన లేదా నల్లటి మచ్చలు ఉన్న ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. వారానికి ఒకసారి వేప నూనెను పిచికారీ చేయాలి. వేసవిలో సాయంత్రం వేళల్లో, వర్షాకాలం, చలికాలంలో ఉదయం వేళల్లో పిచికారీ చేయాలి.
కత్తిరింపు (ప్రూనింగ్):
మొక్కను గుబురుగా పెంచడానికి ప్రూనింగ్ చాలా అవసరం. ఆరు నెలల తర్వాత పెద్ద కుండీలోకి మార్చినప్పటి నుంచి, మొక్క కొద్దిగా పెరిగిన వెంటనే చిగుర్లను పించ్ చేస్తూ ఉండాలి. పూత వస్తే ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇలా చేయడం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొక్క చాలా గ్రీన్ గా, బుషీగా తయారవుతుంది. వేసవి కాలం ప్రారంభానికి ముందు మొక్కకు హార్డ్ ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసిన తర్వాత కొమ్మలు ఎండిపోకుండా ఉండటానికి కత్తిరించిన భాగాలపై సాఫ్ ఫంగిసైడ్ లేదా పసుపు అప్లై చేయాలి.
ఎరువులు, టాప్ సాయిల్ మార్పిడి:
ప్రతి సంవత్సరం రెండుసార్లు (వర్షాకాలం తర్వాత ఒకసారి, వేసవికి ముందు ఒకసారి) కుండీ పై భాగం నుండి రెండు అంగుళాల పాత మట్టిని తీసివేసి, కొత్త సాయిల్ మిశ్రమంతో (కంపోస్ట్, పశువుల ఎరువు) నింపాలి. ఇది మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. పావు కిలో పశువుల ఎరువు, వర్మికంపోస్ట్, వేపపిండిని మట్టితో కలిపి ఇవ్వాలి. వేపపిండిని సంవత్సరానికి 2-3 సార్లు ఇవ్వడం వల్ల రూట్ రాట్ వంటి సమస్యలు తగ్గుతాయి.
పుల్లటి మజ్జిగ:
కరివేపాకు మొక్కకు పుల్లటి మజ్జిగ ఒక ముఖ్యమైన ఎరువు. ఆవు పాలు పెరుగు లేదా సాధారణ పెరుగును మజ్జిగలా చిలికి మూడు రోజులు పులియబెట్టి, అందులో కొద్దిగా ఇంగువ కలిపి 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇది యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది, మట్టిలో సూక్ష్మజీవులను పెంచుతుంది, మట్టిని వదులుగా చేస్తుంది.
నీటిపారుదల:
కరివేపాకు మొక్కకు అతిగా నీరు పోయకూడదు. పైన మట్టి ఎండినట్లు కనిపించినా లోపల తేమ ఉండవచ్చు. మొక్క వాడిపోకుండా, అలాగే అతిగా నీరు పోయకుండా చూసుకోవాలి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ కరివేపాకు మొక్క ఆరోగ్యంగా, గుబురుగా పెరిగి, మీకు తాజా ఆకులను పుష్కలంగా అందిస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..