Reading Time: < 1 minute

పాపన్న విగ్రహం పెట్టకుంటే మేమే పెట్టుకుంటాం: గౌడ, బీసీ సంఘాల హెచ్చరిక 

Caption of Image.

బషీర్​బాగ్, వెలుగు: బహుజనుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధించాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు. గౌడ సంఘాల సమన్వయ కమిటీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 316వ వర్ధంతి సభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోటా కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ బీసీలు జాతి ఐక్యతపై దృష్టి సారించి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే పాపన్న గౌడ్‌‌‌‌కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని డిమాండ్​చేశారు. అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సమకాలీకులని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 18లోగా ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై పాపన్న గౌడ్ 60 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. లేదంటే బహుజనులు స్వయంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. సభకు అంబాల నారాయణగౌడ్ అధ్యక్షత వహించగా, నాయకులు అయిలి వెంకన్నగౌడ్, ఎలికట్టి విజయ్‌‌‌‌కుమార్ గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, కీర్తి లలిత, శేఖర్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.