Reading Time: < 1 minute

ట్రాఫిక్ పోలీసులకు AC హెల్మెట్స్ : ఐడియా అదిరింది కదా..!

Caption of Image.

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగరంలో ఎండలో నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు ఒక చల్లటి వార్త. ఇకపై ట్రాఫిక్ పోలీసులు మండే ఎండలో వేడిని తట్టుకోవడానికి అధికారులు అత్యాధునిక ఏసీ హెల్మెట్లను అందిస్తున్నారు. 

ఉత్తర ప్రదేశ్‌లో వేసవి కాలం వచ్చిందంటే ఎండలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు గంటల తరబడి రోడ్ల మీద నిలబడి డ్యూటీ చేయడం వల్ల వడదెబ్బ తగలడం, నీరసం, అలసట రావడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వారు సరిగ్గా పని చేయలేకపోతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి మన హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఈ ప్రత్యేకమైన హెల్మెట్లను తయారు చేసింది. హెల్మెట్ లోపల ఒక చిన్న మోటార్, ఫ్యాన్ ఉంటాయి. ఇవి హెల్మెట్ లోపలకి చల్లటి గాలిని పంపిస్తాయి. దీనికి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇది కేవలం చల్లదనాన్నే కాకుండా.. కళ్ళకు కూడా  ఎండ వేడి తగలకుండా, ధూళి, కాలుష్యం లోపలికి రాకుండా కాపాడుతుంది.
 
“గతంలో ఎండ వల్ల రెండు గంటలకే అలసిపోయేవాళ్లం, ఇప్పుడు 8 గంటలైనా హుషారుగా పని చేయగలుగుతున్నాం” అని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్, వడోదర, నోయిడా వంటి నగరాల్లో ఇవి సక్సెస్ అయ్యాయి.
 
పోలీసుల ఆరోగ్యం, పనితీరు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ హెల్మెట్లను పంపిణీ చేశారు. ‘స్మార్ట్ పోలీసింగ్’లో భాగంగా ఇలాంటి ఆధునిక పద్ధతులను వాడుతున్నామని… పోలీసులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటేనే ట్రాఫిక్‌ను బాగా కంట్రోల్ చేయగలరు, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు అని ప్రభుత్వం తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.