Reading Time: 2 minutes
Hyderabad: అరేయ్.. ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు.. కట్ చేస్తే..

బైక్ ఒక్కటే.. మహా అయితే.. దానిపై ఇద్దరు వెళ్లొచ్చు.. అతి కష్టం మీద మరొకరు కూర్చోవచ్చు.. కానీ.. ఓ ద్విచక్రవాహనంపై ఐదుగురు యువకులు ప్రయాణిస్తూ.. హల్ చల్ చేశారు. అది కూడా హై సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో.. స్టంట్లు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి, అత్యంత ప్రమాదకర రీతిలో ఒకే బైక్‌పై ఐదుగురు ప్రయాణించిన ఘటనలో.. సైఫాబాద్ పోలీసులు రాపిడో డ్రైవర్‌తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. గత నెల మార్చి 29, 2026 అర్ధరాత్రి సుమారు 01:00 గంటల సమయంలో, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుండి టీజీ సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఒక నలుపు రంగు పల్సర్ బైక్ (నెం: TG 09 K 2918) పై ఐదుగురు వ్యక్తులు అత్యంత నిర్లక్ష్యంగా విన్యాసాలు చేస్కతూ.. ప్రయాణించారు.

Hyderabad Police

Hyderabad Police

దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్ ధరించకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు కూర్చుని వాహనాన్ని నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు గాను వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యానార్ కు చెందిన వడ్డి అర్జున్, మాణికేశ్వర్ నగర్‌కు చెందిన అరుపు రోహిత్, రాంనగర్ గుండుకు చెందిన చింతకుంట అంజ కుమార్, మాణికేశ్వర్ నగర్‌కు చెందిన సిద్దం కౌశిక్, అడిక్‌మెట్‌కు చెందిన వల్లపు మురళి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

ఈ కేసును సైఫాబాద్ ఎస్ఎహెఓ సీతయ్య, ఎస్.ఐ పరమేశ్వరి చేధించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువత సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..