
Off The Record: ఏ రాష్ట్రానికైనా… నీటి పారుదల శాఖ అత్యంత కీలకం. అందునా తెలంగాణ లాంటి స్టేట్‌లో ఇంకా ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి డిపార్ట్‌మెంట్‌లో అత్యంత కీలకమైన పదవి ఇంజినీర్ ఇన్ చీఫ్. కీలకమైన ఒక ఈఎన్సీ పోస్ట్‌ను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు సీనియర్ ఇంజినీర్స్ అయితే ఆశ్చర్యపోతున్నారు కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖలోని ఖాళీల్ని భర్తీ చేయడంతో పాటు ఉద్యోగులు, అధికారుల బదిలీలు, పదోన్నతులు చేపట్టింది. ఈ క్రమంలోనే… ఏళ్లుగా రాష్ట్ర రాజధానితో పాటు ఫోకల్ పోస్టింగ్స్‌లో ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సుమారు వంద మందికి పైగా ఇంజనీర్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం కలకలం రేపింది. మరోవైపు కీలక పోస్టుల్లోని ఉన్నతాధికారుల పదవీ విరమణలు జరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరిగేషన్ ఈఎన్సీ నియమాకం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వెంకట రమేశ్ బాబుకు ఈఎన్‌సీగా బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల చీఫ్ ఇంజినీర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రమేష్ బాబుకు ఈఎన్సీ జనరల్ పదవి కట్టబెట్టారు. నీటిపారుదల శాఖలో ఈఎన్సీ జనరల్ స్థానం అత్యంత కీలకం. గతంలో ఈ శాఖను 19 టెరిటోరియల్స్‌గా విభజించారు. మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఆయా చీఫ్ ఇంజినీర్లకే బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. అన్ని విభాగాలపై పూర్తిస్థాయి నిర్ణయాధికారాన్ని ఈఎన్సీకే కట్టబెట్టింది. ఇరిగేషన్ శాఖ, డ్యామ్ సేఫ్టీకి సంబంధించి రాష్ట్రస్థాయి కమిటీల్లోనూ ఈఎన్సీకే పూర్తి అధికారాలున్నాయి. ఇంత కీలకమైన పదవిలో ఫిబ్రవరి 6న రమేష్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక.. మొన్న మార్చి 31తో ఆయన పదవీ కాలం ముగిసింది. కానీ… ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడంపైనే ఇప్పుడు రచ్చ జరుగుతోంది. రమేష్ బాబు సేవలను వాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే పదవీ కాలాన్ని పొడిగించినట్టు చెబుతున్నా…. కాంట్రాక్టు పద్దతిలో ఈఎన్సీ జనరల్ పదవిలో ఆయన కొనసాగుతారని ఉత్తర్వులు ఇవ్వడమే వివాదాస్పదం అవుతోంది.
అంత కీలకమైన పదవిలో కాంట్రాక్ట్ బేస్‌లో ఎలా నియమిస్తారంటూ ఇంజనీర్స్ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఈఎన్సీ పదవీ కాలాన్ని పొడిగించవద్దని ఇంజనీర్స్ అసోసియేషన్స్ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా రమేష్ బాబు పదవీ కాలాన్ని పొడిగించడం, అందునా కాంట్రాక్ట్ పద్ధతిలో అంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై సీనియర్ ఇంజినీర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవికి అర్హులైన అధికారులు చాలామందే ఉన్నప్పటికీ ప్రభుత్వం రిటైరైన వ్యక్తినే కొనసాగించడం ఎందుకన్నది వాళ్ళ ప్రశ్న. తెలంగాణ నీటి పారుదల శాఖలో ఆరు ఈఎన్సీ పదవులు ఉన్నాయి. మూడు ఇంజినీర్ ఇన్‌చీఫ్ పోస్ట్‌లు జిల్లాల్లో, ఈఎన్సీ జనరల్, అడ్మిన్, ఓ అండ్ ఎం రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈఎన్సీ అడ్మిన్, ఈఎన్సీ జనరల్ పదవులను మాత్రమే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు పదవులను రద్దు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు సీనియర్ అయిన రమేష్ బాబు సేవలను కాంట్రాక్టు పద్దతిలో ఉపయోగించుకోవాలని ప్రబుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.