Reading Time: < 1 minute

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్: మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ

Caption of Image.

చెన్నై: 2026, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 27 మంది పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం (ఏప్రిల్ 3) విడుదల చేసింది. ఈ జాబితా పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మైలాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీ చేయనున్నారు. 

అవనాశి స్థానం నుంచి కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు (ఉత్తర) నుంచి, మోడక్కురిచి నుంచి కృతిక శివకుమార్‌, విలవన్‌కోడ్ నుంచి ఎస్. విజయధరణిని, తళ్లి నుంచి నాగేష్ కుమార్‌ను బరిలోకి దిగనున్నారు. అయితే, తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై పేరు జాబితాలో లేకపోవడం గమనార్హం. సీట్ల పంపకంపై అసంతృప్తితోనే అన్నామలై ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లు తమిళనాడు పాలిటిక్స్‎లో జోరుగా ప్రచారం జరుగుతుతోంది. 

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడులో బీజేపీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)తో కలిసి పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 169 సీట్లలో పోటీ చేయనుండగా.. బీజేపీకి 27 స్థానాలు దక్కాయి. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కి 18 సీట్లు కేటాయించగా, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) 11 స్థానాల్లో పోటీ చేయనుంది.

►ALSO READ | ఏం ఐడియానా :CID అధికారులు అంటూ ప్రైవేట్ స్కూళ్ల నుంచి డబ్బులు వసూళ్లు

 సౌత్‎లో పాగా వేయాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ తమిళనాడులో గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. తమిళనాడులో అధికార పీఠం దక్కించుకుని దక్షిణాదిలో క్రమంగా విస్తరించాలని వ్యూహాలు రచిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు నటుడు విజయ్ టీవీకే పార్టీ కూడా రేసులో ఉంది. 

 

©️ VIL Media Pvt Ltd.