Reading Time: < 1 minute
Telangana: ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు ప్రారంభం!

రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో 2లక్షల కొత్త పెన్షన్లను అందించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. అసెంబ్లీలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్లు తొలగిస్తున్నారనే ఆరోపణలను ఖండిస్తూ.. కేవలం అనర్హులు, మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు వివరించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 42.23 లక్షల మంది వివిధ కేటగిరీల్లో చేయూత పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత-చేనేత కార్మికులు, హెచ్ఐవీ బాధితులకు నెలకు రూ.2,016 అందుతోంది. దివ్యాంగులకు మాత్రం రూ.4,016 పింఛన్ ఇస్తున్నారు.

కొత్త పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్ కోసం మాత్రమే 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. వితంతు, ఒంటరి మహిళలు 3.5 లక్షలు, గీత-చేనేత కార్మికులు 3 లక్షలు, దివ్యాంగుల విభాగంలో సుమారు 72 వేల దరఖాస్తులు ఉన్నాయి.

ఈ దరఖాస్తుల్లోంచి అత్యంత అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. జిల్లా స్థాయిలో వివరాలు సేకరిస్తూ.. అర్హతలపై సమీక్ష జరుగుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కఠిన వడపోత ప్రక్రియ చేపట్టనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే.. జూన్ 2 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.