Reading Time: < 1 minute
ఆగని ట్రంప్‌ టారిఫ్‌ల పర్వం! తాజాగా వాటిపై పన్ను పెంపు.. భారత్‌పై ఎఫెక్ట్‌?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్కు, అల్యూమినియం, రాగి దిగుమతులపై అమలులో ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేపట్టారు. దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడం, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో అమలులో ఉన్న విధానం చాలా సంక్లిష్టంగా ఉండటంతో, కంపెనీలు అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవి. కొత్త మార్పులతో విధానాన్ని పారదర్శకంగా, సులభంగా మార్చే ప్రయత్నం జరిగింది.

కొత్త నిబంధనల ప్రకారం ప్రాథమిక ముడి ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకం కొనసాగుతుంది. అయితే ఈ సుంకాన్ని దిగుమతి ధరపై కాకుండా, వాస్తవ అమ్మకపు ధరపై విధించడం ప్రధాన మార్పుగా నిలిచింది. ధరలను తక్కువగా చూపించి పన్ను ఎగవేతను అరికట్టడమే దీని లక్ష్యంగా పేర్కొంటున్నారు. ఇక లోహంతో తయారైన ఉత్పత్తుల విషయంలో కొత్త విధానం మరింత స్పష్టత తీసుకొచ్చింది. ఒక ఉత్పత్తిలో 15 శాతం కంటే తక్కువగా ఉక్కు, అల్యూమినియం లేదా రాగి ఉంటే, దానిపై సుంకం విధించరు. దీంతో చిన్న గృహోపకరణాలు, తేలికపాటి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ లోహాల శాతం 15కు మించితే, మొత్తం ఉత్పత్తిపై 25 శాతం సుంకం విధిస్తారు. ఉదాహరణకు వాషింగ్ మెషీన్లు, గ్యాస్ స్టవ్‌ల వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

పారిశ్రామిక రంగానికి కొంత ఊరట కల్పిస్తూ, కొన్ని యంత్రాలు, విద్యుత్ పరికరాలపై సుంకాలను 15 శాతానికి తగ్గించారు. ఈ ఉపశమనం 2027 వరకు కొనసాగనుంది. విదేశాలలో తయారైన ఉత్పత్తుల్లో అమెరికన్ లోహాలు ఉపయోగిస్తే, కేవలం 10 శాతం సుంకం మాత్రమే విధించడం ద్వారా దేశీయ లోహ పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులు ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలకు అమెరికా ఎగుమతులు ఖరీదవుతాయి. లోహాలతో తయారైన వస్తువుల ధరలు పెరగడం వల్ల సరఫరా గొలుసుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ నిర్ణయం అమెరికా పరిశ్రమకు మద్దతు ఇచ్చినా, అంతర్జాతీయ వాణిజ్యంలో అస్థిరతను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి