
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కాస్త వివాదాస్పదమైంది. అభిషేక్ 48 పరుగుల వద్ద ఉండగా.. బ్లెస్సింగ్ ముజర్బాని వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఓ బంతిని అభిషేక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. అయితే అది నేలకు తగిలిందో.. లేదో.. తెలుసుకునేందుకు థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించాడు. క్యాచ్‌ని నిశితంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి చేతిలోనే పడిందని గుర్తించి దాన్ని ఔట్‌గా ప్రకటించారు.
అయితే హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో అభిషేక్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. అయితే అసలే నిరుత్సాహంలో ఉన్న అభిషేక్‌కి మరో షాక్ తగిలింది. అతడికి భారీ జరిమానా పడింది. అభిషేక్ మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధిస్తున్నట్లు ఐపిఎల్ గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు వెల్లడించింది. మ్యాచ్ ఫీజులో కోతనే కాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది.
‘‘సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మపై 25 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధించాం. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ని జత చేశాం. ఆర్టికల్ 2.3 కిందకు వచ్చే లెవల్ 1 నేరాన్ని అతడు అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన దానిని స్వీకరించాడు. ఇక్కడ మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపిఎల్ స్పష్టం చేశారు. అయితే ఏ తప్పిదానికి ఈ జరిమానా విధించిందో ఐపిఎల్ వెల్లడించలేదు.