
ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం (ఏప్రిల్ 3) ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో చెన్నైను చిత్తు చేసింది పంజాబ్. శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. తొలి మ్యాచులో ఓటమి పాలైన చెన్నై హోం గ్రౌండ్లో జరిగిన రెండో మ్యాచులో కూడా ఓడి సీజన్లో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే (73) హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (32), శివమ్ దూబే (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, యాన్సెన్, చాహల్ తలో వికెట్ సాధించారు. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ చెన్నై నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ప్రియాంశ్ ఆర్య (39), ప్రభుసిమ్రాన్ సింగ్ (43), కూపర్ కానలీ (36) రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, హెన్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆర్య అయ్యర్ ధనాధన్..
210 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన పంజాబ్‌కు మెరుపు ఆరంభం లభించింది. యంగ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య బౌండరీల వర్షం కురిపించాడు. చెన్నై బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ (43) కూడా దూకుడుగా ఆడాడు. తొలి మ్యాచ్ హీరో కూపర్ కానలీ (36) ఈ మ్యాచులో కూడా రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ (50) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో అయ్యర్ ఔటైనా శశాంక్ (14), స్టోయినిస్ (9) రాణించి మిగితా లాంఛనాన్ని పూర్తి చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
శాంసన్ ఫట్.. మాత్రే హిట్
ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు సరైన శుభారంభం దక్కలేదు. పంజాబ్ బౌలర్ బార్ట్లెట్ రెండో ఓవర్లోనే సంజు శాంసన్ (7)ను ఔట్ చేసి చెన్నైకు షాకిచ్చాడు. దీంతో వరుసగా రెండో మ్యాచులో కూడా విఫలమైన శాంసన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. శాంసన్ ఔటైన తర్వాత కెప్టెన్ గైక్వాడ్ (28)తో కలిసి యువ ఆటగాడు మాత్రే చెలరేగి ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
►ALSO READ | IPL 2026: ఆర్సీబీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సరికొత్త చరిత్ర
ఓవరాల్‌గా 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 73 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. హార్డ్ హిట్టర్‌గా పేరున్న యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (3) ఈ మ్యాచులో కూడా నిరాశ పర్చాడు. ఈ దశలో జతకట్టిన సర్ఫరాజ్ ఖాన్ (32), శివమ్ దూబే (40) చివర్లో మెరుపులు మెరిపించి చెన్నైకు భారీ స్కోర్ అందించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, యాన్సెన్, చాహల్ తలో వికెట్ సాధించారు.