Reading Time: < 1 minute
దోమ.. చూడ్డానికి చిన్నజీవే.. దోమల దండయాత్రపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ..!

ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి తీసిన ఈగ సినిమాలో కంటే హైదరాబాద్ జనాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి దోమలు. గతంలో ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన దోమలు.. ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు.. రోజుకు 24 గంటలూ కుట్టికుట్టి పగ తీర్చుకుంటున్నాయి. అటు ప్రతిపక్షం సైతం దోమల దండయాత్రపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

దోమ.. చూడ్డానికి చిన్నజీవే. అయినా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. రెండు పార్టీల మధ్య మాటలు మంట రేపుతోంది. ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లే దోమల సమస్య పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే అసెంబ్లీ ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేవనెత్తగా..లేటెస్ట్‌గా ఆ సమస్యను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజువలైజ్ చేసి చూపించారు. ప్రభుత్వానికి దోమల బాధను వివరించేందుకు దోమ తెరను ధరించి, ఫాగింగ్ మిషన్‌తో అసెంబ్లీ ఆవరణకు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. దోమలపై యుద్ధంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా దోమల సమస్యపై సెటైర్లు వేశారు మాజీమంత్రి కేటీఆర్. దోమల సమస్యపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు.. మరోవైపు, మూసీ సమస్యను పరిష్కరిస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాము చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌తో దోమల సమస్యతో పాటు అనేక ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని భరోసా ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య దోమల రాజకీయం ఎలా ఉన్నా తమకు ఈ బాధ నుండి విముక్తి కలిగితే చాలని వేడుకున్నారు నగర జనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..