Reading Time: 2 minutes

సూర్యాపేట రెవెన్యూలో ఆగని భూ దందా!

Caption of Image.
  • అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌గా తహసీల్దార్ కార్యాలయాలు?
  • నిషేధిత భూములకు యథేచ్ఛగా పట్టాలు
  • కలెక్టర్ ఆదేశాలకూ బేఖాతరు
  • కలెక్టరేట్ కేంద్రంగా అక్రమ లావాదేవీలు!
  • సీసీఎల్ఏకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమాలు వరుసగా బయటపడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. తహసీల్దార్ల అక్రమాలకు బలైన బాధితులు న్యాయం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో  సీసీఎల్ఏ మెట్లు ఎక్కుతున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా సూర్యాపేట కలెక్టర్  ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ నిషేధిత జాబితాలో ఉన్న నాలా కన్వర్షన్ అయిన భూమికి ఏకంగా పట్టాలు ఇవ్వడం గమనార్హం. 

ఇదీ పరిస్థితి..

గత ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డు పెట్టుకొని రెవెన్యూ అధికారులు భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టింది. అయినా కొంతమంది రెవెన్యూ అధికారులు మాత్రం తమ అక్రమాలను యాథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ పరిస్థితిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, సీఎంవో లో సైతం ఫిర్యాదులు చేశారు. గతేడాది హుజూర్ నగర్ లో  ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు ఇచ్చి, రైతుబంధు నిధులు పొందేలా చేసినందుకు అప్పటి తహసీల్దార్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌పై కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

వీటితో పాటు  మోతె మండలంలో భూ రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌తో పాటు ముగ్గురు ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు, వీఆర్‌‌‌‌‌‌‌‌ఓ, వీఆర్‌‌‌‌‌‌‌‌ఏ లపై  సైతం కేసులు నమోదు కాగా,  ఆత్మకూర్ (ఎస్) మండలంలో  రికార్డులలో పేరు లేకపోయినా, భారీగా ముడుపులు తీసుకొని భూమిని పట్టా చేసినందుకుగాను డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు ఆర్‌‌‌‌‌‌‌‌ఐలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. 

కోదాడ మండలంలో సైతం ఒకరి భూమిని మరొకరి పేరు మీద అక్రమంగా మార్చినందుకు ఆర్‌‌‌‌‌‌‌‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఆత్మకూర్(ఎస్) మండలంలో ఇటీవల ఒకరి భూమిని మరొకరి పై పట్టా చేసినందుకు అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బాధితులు ఆశ్రయించారు. అయినా పట్టా రద్దు చేయకుండా బాధితులను ఇబ్బంది పెడుతుండడంతో ఏకంగా సీఎంవోలో ఫిర్యాదు చేయడంతో ఇటీవల ఇంటలిజెన్స్ అధికారులు అక్రమాలపై రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. తాజాగా సూర్యాపేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 71/3 లోని 2.34ఎకరాల భూమికి 2014 లో నాలా అనుమతులు తీసుకొని వెంచర్ వేసుకొని అమ్ముకున్నారు. కాగా, ఇదే భూమిని మొదటి యజమానులు ఈ ఏడాది ఫిభ్రవరిలో వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. వెంచర్ వేసిన భూమికి 2024లో మొదటి యజమానికే పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయగా, దీనికి సంబంధించిన బాధితులు ఎలాంటి లావాదేవిలు జరగకుండా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. అయినా తహసీల్దార్ ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు.

అక్రమాలన్నీ కలెక్టరేట్ కేంద్రంగానే..!

అక్రమాలన్నీ కలెక్టరేట్ కేంద్రంగానే ఒక ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లోని కొందరు కింది స్థాయి సిబ్బంది, మండలాల్లోని ధరణి ఆపరేటర్లతో కలిసి ఒక సిండికేట్‌‌‌‌‌‌‌‌గా ఏర్పడి భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో అవినీతి ఆరోపణలతో బదిలీ అయిన వ్యక్తులను తిరిగి కీలక స్థానాల్లో నియమించి, వారి ద్వారా వివాదాస్పద భూములకు పట్టాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లోని ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ అక్రమ టీమ్​కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, అందుకే ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పెరుగుతున్న భూఅక్రమాలను నిగ్గుతేల్చేందుకు సీసీఎల్ఏ అధికారుల బృందం త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే నిజాలు..

ధరణి ద్వారా జరిగిన లావాదేవీలపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొందరు అధికారులు తమ డిజిటల్ కీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి, అర్ధరాత్రి వేళల్లో నిషేధిత భూములను సాధారణ భూములుగా మార్చినట్లు తేలింది. త్వరలో రానున్న ఉన్నతస్థాయి బృందం గత కొన్నేళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర తనిఖీలు చేపట్టనుంది. ఈ విచారణలో దోషులుగా తేలిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

©️ VIL Media Pvt Ltd.