
Nitish Kumar Reddy: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 39 పరుగులు చేసిన నితీష్, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో గాయాల కారణంగా ఇబ్బంది పడిన ఈ యువ ఆటగాడు, ఈ ఏడాది తన బౌలింగ్ శైలిని పూర్తిగా మార్చుకుని ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన బౌలింగ్ మెరుగుపడటం వెనుక ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నారని నితీష్ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బౌలింగ్ రహస్యంపై నితీష్ ఏమన్నారంటే?
విజయం అనంతరం నితీష్ మాట్లాడుతూ.. తన బౌలింగ్ మెరుగుదలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. “నేను నా బౌలింగ్ విషయంలో నిరంతరం శ్రమిస్తుంటాను. గత ఏడాది గాయాల వల్ల సాధన చేయడానికి తగిన సమయం దొరకలేదు. కానీ ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఒక వారం పాటు ఒక ప్రత్యేక వ్యక్తి పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. ఆయన ఇచ్చిన సూచనలు ఇప్పుడు మైదానంలో అమలు చేస్తున్నాను. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడే బయట పెట్టను, త్వరలోనే వెల్లడిస్తాను” అని నితీష్ సస్పెన్స్ మెయింటైన్ చేశాడు.
పిచ్ పరిస్థితులు, వ్యూహాల అమలు..
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుందని నితీష్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పిచ్ నెమ్మదిగా ఉందని గమనించినట్లు చెప్పాడు. “కోల్‌కతా బౌలర్లు స్లో బౌన్సర్లు వేయడం చూశాక, మేము బౌలింగ్ చేసేటప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. రింకూ సింగ్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్ వికెట్‌ను స్లో బంతి ద్వారానే పడగొట్టాను. పిచ్ పరిస్థితులను గౌరవించి బౌలింగ్ చేయడం వల్లే ఫలితం దక్కింది” అని వివరించాడు.
సీనియర్ల సూచనలు..
హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని నితీష్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లు ఇచ్చే సూచనలు యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడతాయని అన్నాడు. అలాగే తమ బౌలింగ్ విభాగంపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశాడు. జయదేవ్ ఉనద్కత్ వంటి సీనియర్లతో పాటు హర్షల్ పటేల్, డేవిడ్ పైన్ వంటి నాణ్యమైన బౌలర్లు తమ జట్టులో ఉన్నారని, హైదరాబాద్‌లోని ఫ్లాట్ వికెట్లపై బౌలింగ్ చేయడం ఒక సవాల్ అని నితీష్ స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..