
- గల్ఫ్ దేశాల్లోని 8 అతిపెద్ద బ్రిడ్జిలను పేల్చేస్తామని వార్నింగ్
- తమ ఫైటర్ జెట్లు కూలిపోయాయన్నది అబద్ధమన్న అమెరికా
- ఇరాన్ డీల్ కుదుర్చుకోకుంటే మరిన్ని బ్రిడ్జిలతోపాటు పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం: ట్రంప్
- తాను కింగ్ కాదు.. క్రీస్తును అంటూ కామెంట్
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్:గడిచిన 24 గంటల్లో తాము రెండు అమెరికన్ ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను కూల్చివేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం మూడు( మార్చి 3న, ఏప్రిల్ 2న, 3న) ఎఫ్ -35 జెట్‌లను కూల్చామని తెలిపింది. తాజాగా కూల్చిన జెట్ అమెరికా ‘లేకెన్‌హీత్’ స్క్వాడ్రన్‌కు చెందినదని, దీనికి ముందు గురువారం ఖేష్మ్ దీవి వద్ద ఒక జెట్ ను కూల్చామని వెల్లడించింది.
ఇరాన్ గగనతలంలో శుక్రవారం ఒక అమెరికా జెట్ కూలిపోయిందని పేర్కొంటూ దాని శకలాల ఫొటోలను ఇరాన్ మీడియా సంస్థ ‘తస్నిమ్’ విడుదల చేసింది. విమానం గాలిలోనే ముక్కలైపోవడంతో పైలట్లు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని పేర్కొంది. అయితే, ఇరాన్ తాజా వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఖండించింది. తమ విమానాలన్నీ భద్రంగా ఉన్నాయని, ఇరాన్ అబద్ధాలు చెబుతోందని మండిపడింది. ఇరాన్ చూపించిన శకలాలపై ఎరుపు, తెలుపు, పచ్చ రంగులు, పసుపు చారలు, ‘యూరప్’ అని రాసి ఉందని.. అవి ఎఫ్-35 జెట్ లక్షణాలకు (స్టీల్త్ కోటింగ్, అమెరికన్ మార్కింగ్స్) ఏమాత్రం సరిపోలడం లేదని ‘గ్రోక్’ తెలిపింది.
- పైలట్ కోసం వెళ్లిన హెలికాప్టర్ కూల్చివేత..!
ఇరాన్ సరిహద్దులో అమెరికాకు చెందిన ‘యూహెచ్-60 బ్లాక్ హాక్’ హెలికాప్టర్‌ను ఇరాన్ దళాలు కూల్చివేశాయి. దీనికి కొన్ని గంటల ముందే సెంట్రల్ ఇరాన్‌లో అమెరికా ‘ఎఫ్-15ఈ’ యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పారాచూట్ ద్వారా బయటపడ్డ అమెరికా పైలట్‌ను ఇరాన్ బంధించింది. ఈ పైలట్‌ను రక్షించేందుకు వచ్చిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌పై దాడి చేసి కూల్చేశామని ప్రకటించింది.
- ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్ దేశాలు
కువైట్‌లోని మినా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ శుక్రవారం దాడి చేసింది. భారీగా వ్యాపించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అలాగే ఒక నీటి శుద్ధీకరణ ప్లాంట్ కూడా దెబ్బతిన్నట్లు కువైట్ తెలిపింది. బహ్రెయిన్, సౌదీ అరేబియాలో కూడా దాడుల హెచ్చరికలు వినిపించాయి. యూఏఈలోని ఒక గ్యాస్ ఫీల్డ్‌లో క్షిపణి శకలాలు పడటంతో మంటలు చెలరేగాయి. రాత్రిపూట టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించగా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. అబుదాబిలోని హబ్షన్ గ్యాస్ కేంద్రంపై క్షిపణి శకలాలు పడ్డాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా బలగాలు కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇస్ఫహాన్ నగరాల సమీపంలో వైమానిక దాడులు జరిపాయి.
- ఇది శత్రువు నైతిక పతనం: అరాఘ్చీ
కరాజ్ బ్రిడ్జిపై అమెరికా దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా ఖండించారు. ‘నిర్మాణంలో ఉన్న వంతెనలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేసినంత మాత్రాన ఇరాన్ లొంగిపోదు. ఇది శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తోంది. ప్రతి వంతెనను, భవనాన్ని మేము మరింత పటిష్టంగా నిర్మిస్తాం. కానీ అమెరికా కోల్పోయిన ప్రతిష్టను మాత్రం ఎవరూ తీసుకురాలేరు’ అని ఆయన పేర్కొన్నారు.
- అమెరికన్ కంపెనీలను తుడిచిపెట్టేస్తాం..
ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ దీటుగా స్పందించింది. బహ్రెయిన్‌లోని అమెజాన్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న మరుసటి రోజే, పశ్చిమాసియాలోని ఐటీ సంస్థలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ‘మా విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులకు దిగితే, తక్షణమే ప్రతీకార చర్యలు చేపడతాం. ఈ ప్రాంతంలోని అమెరికా వాటాలు కలిగిన సమాచార, సాంకేతిక సంస్థలు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇంధన వనరులను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా హెచ్‌క్యూ ప్రతినిధి హెచ్చరించారు.
- నెక్స్ట్ టార్గెట్లు బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లే: ట్రంప్
ఇరాన్‌ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ దళాలు ప్రతీకార చర్యలకు దిగుతున్న వేళ, ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మా సైన్యం, ఇరాన్‌లో మిగిలి ఉన్న వాటిని ధ్వంసం చేయడం ఇంకా మొదలుపెట్టలేదు. తదుపరి లక్ష్యం అక్కడి వంతెనలు, ఆ తర్వాత విద్యుత్ కేంద్రాలే! ఇరాన్ కొత్త నాయకత్వం ఏం చేయాలో వారికి తెలుసు, అది చాలా వేగంగా చేయాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. కరాజ్‌లోని బీ1 వంతెన కూలిపోతున్న వీడియోను మరోసారి షేర్ చేసిన ఆయన.. ‘సర్వస్వం కోల్పోకముందే చర్చలకు రావడానికి ఇదే సరైన సమయం’ అని అల్టిమేటం జారీ చేశారు.
- గల్ఫ్ దేశాల్లోని 8 బ్రిడ్జిలు పేల్చేస్తాం: ఇరాన్ వార్నింగ్
ఇరాన్‌లోని కరాజ్ సమీపంలో బీ1 వంతెనపై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలు, జోర్డాన్‌లోని 8 ప్రధాన వంతెనలను కూల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈమేరకు ఐఆర్‌జీసీకి సన్నిహితంగా ఉండే ఫార్స్ వార్తా సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది. కువైట్‌లోని షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా వంతెన, సౌదీ, బహ్రెయిన్‌లను కలిపే కింగ్ ఫహద్ కాజ్వే బ్రిడ్జి, యూఏఈలోని షేక్ జాయెద్ వంతెన, అల్ మక్తా వంతెన, జోర్డాన్ లోని కింగ్ హుస్సేన్, డామియా, షేక్ ఖలీఫా, అబ్దూన్ బ్రడ్జిలు ఐఆర్‌జీసీ హిట్ లిస్టులో ఉన్నాయని ప్రకటించింది. కాగా, కరాజ్ సమీపంలోని వంతెనపై జరిగిన శక్తివంతమైన వైమానిక దాడిలో 8 మంది పౌరులు మరణించారు.