
- భూకక్ష్యలోకి చేరిన నలుగురు వ్యోమగాములు
- 10 రోజుల పాటు యాత్ర.. జాబిల్లి చుట్టూ ప్రదక్షిణ
చంద్రుడి చెంతకు మానవుడిని పంపే లక్ష్యంతో నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.35 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
కేప్ కేనవెరాల్(ఫ్లోరిడా):
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అర్ధ శతాబ్దం తర్వాత మళ్ళీ చంద్రుడి చెంతకు మానవుడిని పంపే లక్ష్యంతో నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.35 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4 గంటలు) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అత్యంత శక్తివంతమైన, 32 అంతస్తుల ఎత్తున్న ఆర్టెమిస్ 2 ఎస్ఎల్ఎస్ (స్పేస్ లాంచ్ సిస్టమ్) రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను భారీ రాకెట్ విజయవంతంగా భూకక్ష్యలోకి చేర్చింది. అయితే, ఉదయం రాకెట్‌లో ఇంధనాన్ని నింపుతున్నప్పుడు కొంత ఉత్కంఠ నెలకొంది. గతంలో హైడ్రోజన్ లీకేజీల వల్ల ప్రయోగం ఆలస్యమైనప్పటికీ, ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 26 లక్షల లీటర్ల ఇంధనాన్ని విజయవంతంగా నింపారు.
చివరి నిమిషంలో బ్యాటరీ సెన్సర్లు, కమాండ్ సిస్టమ్‌లో కొన్ని చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఇంజనీర్లు వాటిని తక్షణమే పరిష్కరించి ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. చివరకు “మనం చంద్రుడిపైకి వెళ్తున్నాం!” అంటూ మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ ఉత్సాహంగా కేకలు వేస్తూ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ చారిత్రక ప్రయాణంలో ఆయనతో పాటు పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఉన్నారు.
వీరిలో చంద్రుడి యాత్రకు వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్, తొలి నల్లజాతీయుడిగా విక్టర్ గ్లోవర్, నాసా మూన్ మిషన్ లో పాల్గొన్న తొలి అమెరికాయేతర పౌరుడిగా జెరెమీ హాన్సెన్ చరిత్ర సృష్టించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు పరిసర ప్రాంతాలకు తరలివచ్చారు. కాగా, ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ప్రారంభం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. “మన సాహసవంతులైన వ్యోమగాములకు, నాసా బృందానికి అభినందనలు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం” అని ఆయన కొనియాడారు.
- పది రోజుల యాత్ర సాగుతుందిలా..
ప్రస్తుతం భూ కక్ష్యలోకి చేరిన ఈ నలుగురు వ్యోమగాములు, సుమారు 25 గంటల పాటు భూమి చుట్టూ తిరుగుతూ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లోని వ్యవస్థలన్నింటినీ తనిఖీ చేస్తారు. ఆ తర్వాత చంద్రుడి వైపు దూసుకెళ్తారు. వీరు చంద్రుడిపై దిగరు కానీ, చంద్రుడికి అవతలి వైపు సుమారు 6,400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి వస్తారు.
ఇంత దూరం వెళ్లిన మానవులుగా వీరు రికార్డు సృష్టించనున్నారు. సోమవారం నాటి చంద్రుడి ప్రయాణంలో వ్యోమగాములకు అరుదైన దృశ్యాలు కనిపించనున్నాయి. అక్కడ వారు పూర్తి సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించే అవకాశం ఉంది. ఈ ప్రయాణంలో ఓరియన్ క్యాప్సూల్‌లోని వాటర్ డిస్పెన్సర్, టాయిలెట్ వంటి కొత్త వ్యవస్థలను కూడా పరీక్షిస్తున్నారు. అయితే, ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే టాయిలెట్‌లో చిన్న సమస్య తలెత్తడంతో, ప్రత్యామ్నాయ పద్ధతులను వాడాలని నాసా సూచించింది. పది రోజుల పాటు సాగే ఈ యాత్ర ద్వారా అంతరిక్ష నౌక పనితీరును, భూమి నుంచి పంపే సంకేతాల సమన్వయాన్ని, మానవ మనుగడకు అవసరమైన వ్యవస్థల సామర్థ్యాన్ని నాసా పరీక్షిస్తుంది. భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులను దించడానికి చేపట్టే ఆర్టెమిస్-3 మిషన్ కు ఇది ఒక కీలకమైన పునాదిగా నిలవనుంది.