
Curd Rice vs Dal Rice: భారతీయ సంప్రదాయ ఆహారాల్లో పోషకాలు, రుచులు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా సమతుల్యంగా ఉంటాయి. అలాంటి రెండు ముఖ్యమైన వంటకాలు పెరుగు అన్నం, పప్పు అన్నం.. అయితే, ఇవి రెండూ సులభంగా జీర్ణమయ్యే ఆహారాలుగా పేరుగాంచాయి. ముఖ్యంగా అనారోగ్యం లేదా జీర్ణ సమస్యల సమయంలో వీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, పేగు ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఏది మెరుగో అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది.
పెరుగు అన్నం ఉపయోగాలు..
* పెరుగు అన్నం పేగుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ గట్‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మలవిసర్జన సులభతరం అవుతుంది. అలాగే కడుపులో ఉబ్బరం, అసౌకర్యం తగ్గుతాయి. పెరుగు శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు జీర్ణాశయానికి ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటీ, అజీర్ణం లేదా యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత పెరుగు అన్నం తీసుకోవడం చాలా మంచిదిగా భావిస్తారు.
* పెరుగు అన్నంలో లాక్టోస్ పరిమాణం తక్కువగా ఉండటంతో, ఇది చాలా మందికి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఇది పేగులలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవికాలంలో శరీరానికి అవసరమైన హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా ఇది కాపాడుతుంది.
పప్పు అన్నం ఉపయోగాలు..
* పప్పు అన్నం విషయానికి వస్తే, ఇది దీర్ఘకాలిక పేగు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. పప్పులో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల ఇది ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. పేగులలోని మంచి బ్యాక్టీరియాకు ఇది ఆహారంగా మారి వాటి వృద్ధిని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల గట్ మైక్రోబయోమ్ బలపడుతుంది.
* పప్పు అన్నం క్రమమైన మలవిసర్జనకు కూడా సహాయపడుతుంది. పీచుపదార్థం మలం పరిమాణాన్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం కావడంతో శక్తి విడుదల స్థిరంగా ఉంటుంది. అలాగే పప్పులో ఉండే ప్రోటీన్ పేగుల కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
పెరుగు అన్నం వర్సెస్ పప్పు అన్నం.. ఏది మంచిది..?
* పేగు ఆరోగ్యానికి ఏది మంచిదన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే.. ఈ రెండూ తమ తమ విధంగా ఉపయోగకరమే. జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నప్పుడు లేదా తక్షణ ఉపశమనం కావాలనుకున్నప్పుడు పెరుగు అన్నం మంచిది. దీర్ఘకాలికంగా పేగుల బలాన్ని పెంచుకోవాలంటే పప్పు అన్నం మరింత ఉపయోగకరం. మొత్తానికి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ఈ రెండు ఆహారాలను సమతుల్యంగా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమ మార్గం అంటున్నారు..