
హైదరాబాద్: ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు.. చేనేతలకు జీవితమని అన్నారు. హెచ్ఐసిసి లో ఆసియా టెక్స్ టైల్స్ కాన్పరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎం, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదని.. చేనేత జీవితమని అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలియజేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమని, దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కట్టడాలు, ముత్యాలకు ప్రసిద్ధని, తెలంగాణ కాటన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారిందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పర్యావరణ పరిరక్షణే తాను తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.